Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్‌షాక్.. బెయిల్ పిటీషన్ డిస్మిస్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది.

Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.
Also Read: Rajalingamurthy: మేడిగడ్డపై కేసీఆర్, హరీశ్ మీద కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య.. భూ వివాదమే కారణం
దళిత యువకుడు సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలతో మూడు రోజుల కిందట పోలీసులు వంశీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వంశీ విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలులో ఉన్న ఆయన్ను రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 30 నిమిషాలపాటు వంశీతో జగన్ మాట్లాడారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోందని జగన్ విమర్శించారు.
Also Read: Case On YS Jagan : వైఎస్ జగన్ పై కేసు నమోదు.. ఎందుకంటే..
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ప్రోద్భలంతో దాడి జరిగినట్లు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీతో పాటు మొత్తం 88 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో విచారణ తుది దశకు వచ్చిన తరుణంలో సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు. తనకు, ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లనే అతను ఫిర్యాదు వెనక్కు తీసుకున్నట్లు గుర్తించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, అతనిపై దాడి వెనుక వంశీతోపాటు మరికొందరి హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.
విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ లో వంశీతోపాటు మరికొందరిపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో విజయవాడలోని పటమట పోలీసులు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. అతన్ని విజయవాడ కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు.. నిందితుడు వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఇవాళ్టికి వాయిదా వేసింది.