ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

Ap High Court suspends Endowments department issued memo : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా నవంబర్ 18న 23 ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మర్యాదలు చేయాలంటూ దేవాదాయ శాఖ జారీ చేసిన మెమో వివాదాస్పదమైంది.
ఈ విషయమై చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు హై కోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ ను విచారించిన న్యాయస్ధానం ఇరువైపు వాదనలు విన్న అనంతరం మెమోను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అడిగిన మీదట తాము కూడా లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు శారదాపీఠం స్వరూపానందస్వామి తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ కేసును మూసివేసింది.
కాగా….. దేవాదాయ శాఖ ఇచ్చిన వివాదాస్పద ఆదేశాలపై విశాఖ శారదా పీఠం స్పందించింది. ‘సనాతన హైందవ ధర్మ పరిరక్షణే విశాఖ శ్రీ శారదాపీఠం ముఖ్య ప్రాధాన్యత. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చేయడానికి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానేందేంద్ర సరస్వతి మహాస్వామి చేస్తున్న కృషి విదితమే.
https://10tv.in/cbi-case-on-indecent-posts-against-ap-high-court-judges-on-social-media/
గత మూడ్రోజులుగా మహాస్వామి వారి జన్మ దినోత్సవ వేడుకలపై అసత్యప్రచారం, అనవసర రాద్ధాంతం జరుగుతోంది. మహాస్వామి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జన్మదిన మహోత్సవం రోజున ఆలయ మర్యాదలు కోరాం. 2004 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆలయాల నుంచి మహాస్వామి వారికి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఆ సాంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని విశాఖ శ్రీ శారదా పీఠం కోరడమైనది. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తాం’ అని ప్రకటన విడుదల చేశారు.