మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేము అరెస్ట్ చేస్తున్నాం- జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్

ఆడపిల్లల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వారిపై కేసులు ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచనలు కూడా కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు.

మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేము అరెస్ట్ చేస్తున్నాం- జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్

Updated On : November 13, 2024 / 7:44 PM IST

Home Minister Vangalapudi Anitha : వైసీపీ అధినేత జగన్ పై సెటైర్లు వేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా అసెంబ్లీకి రాడని 11 రూపాయలకు పందాలు నడుస్తున్నాయ్ అని ఆమె ఎద్దేవా చేశారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణ రాజు సభాపతి స్థానంలో కూర్చున్నాక జగన్ కు ఏ పదవి ఇచ్చినా అసెంబ్లీకి రాడని 11 రూపాయల పందెం కాస్తున్నారని అన్నారు. జగన్ తాడేపల్లిలో మాక్ అసెంబ్లీ పెట్టాలనుకుంటే కోరం కూడా లేదని తెలిసిందన్నారు. చివరికి ఆ 11 మంది కూడా సహకరించట్లేదని ఆమె అన్నారు.

సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించటo విడ్డూరంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. సభ్య సమాజంలో వర్రా రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనీల్, ఇంటూరి రవి లాంటి వాళ్లు తిరగటానికి వీల్లేదన్నారు. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయటం ఎంతవరకు అవసరమో ప్రజలూ ఆలోచన చేయాలన్నారు. క్షమించరాని పోస్టులతో తప్పు చేసిన అలాంటి వారిని వెనకేసుకొస్తున్న వైసీపీ నేతలను ఏమనాలి? అని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ప్రజాధనంతో నడిచే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అసభ్య పోస్టులు పెట్టించిన సజ్జల భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను కాపాడాలని మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించారా? అని వైసీపీ నేతలను ఆమె నిలదీశారు.

జగన్ తల్లిని, చెల్లిని కించపరుస్తున్న ఫిర్యాదులపై అరెస్టులు జరుగుతున్నాయని.. ఎన్ హెచ్ ఆర్ సీకి వైవీ సుబ్బారెడ్డిని జగన్ పంపించారా? అని అడిగారు. నేరంలో తన భాగస్వామ్యం ఉందన్నట్లుగా వైవీ సుబ్బారెడ్డి చొరవ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో నేరస్థులు ఎన్ని వేషాలు వేసినా, వారి ముసుగు తీసి ప్రజల ముందు నిలబెట్టే ప్రభుత్వం మాది అని అనిత వ్యాఖ్యానించారు. పుంగనూరు, తిరుపతి ఘటనల్లో బాలిక ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తున్న ప్రకటనలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వారిపై కేసులు ఆపేది లేదని, దీనిపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచనలు కూడా కూటమి ప్రభుత్వం చేస్తోందని హోంమంత్రి అనిత చెప్పారు.

”గతంలో నేరస్థులు రాజకీయ ముసుగులో ఉన్మాదం సృష్టించారు. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేము అరెస్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కూటమి నేతలే అన్నట్లే దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో జగన్ ను ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారు. నన్ను హౌస్ అరెస్టులు చేసిన ఘటనలు ఎన్నో” అని హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు.

Also Read : వైఎస్ షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టుల వెనకున్నది ఎవరో తెలిసిపోయిందా?