ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ ఆఫీస్‌కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. భారీ బందోబస్తు.. అరెస్టుపై ఉత్కంఠ.. ఏం జరగబోతుంది..!

ఏపీలో మద్యం కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ ఆఫీస్‌కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. భారీ బందోబస్తు.. అరెస్టుపై ఉత్కంఠ.. ఏం జరగబోతుంది..!

YCP MP Mithun Reddy

Updated On : July 19, 2025 / 1:01 PM IST

YCP MP Mithun Reddy sit investigation updates: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మిథున్ రెడ్డికి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన సిట్ కార్యాలయంకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి.. తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి మాటలతో కేసు పెట్టారు.. ఎలాంటి ఆధారాలు లేవు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని మిథున్ రెడ్డి చెప్పారు. మిథున్ రెడ్డి సిట్ కార్యాలయం వద్దకు చేరుకోవటంతో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సిట్ కార్యాలయం వద్ద బారికేట్లు పెట్టిన పోలీసులు.. ట్రాఫిక్ పక్క రోడ్లకు మళ్లించారు. సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తోంది. డిస్టిలరీల నుంచి లిక్కర్ ఆర్డర్స్ తీసుకోవడం నుంచి ముడుపులు వసూళ్ల వరకు తెరవెనుక కథను మిథున్ రెడ్డే నడిపారని సిట్ ఇప్పటికే హైకోర్టు, ఏసీబీ కోర్టుకు నివేదించింది.

ఏపీ మద్యం స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మిధున్ రెడ్డి పేర్కొన్నారు.అయితే, ఈ పిటిషన్ పై వాదనలువిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో శనివారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. అయితే, విచారణ అనంతరం అతన్ని సిట్ అధికారులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది.