AP Rains : ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి.. వరద గుప్పిట్లో ఈ ప్రాంతాలు.. అధికారుల హెచ్చరికలు జారీ.. విద్యాసంస్థలకు సెలవు..

AP Rains : శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

AP Rains : ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి.. వరద గుప్పిట్లో ఈ ప్రాంతాలు.. అధికారుల హెచ్చరికలు జారీ.. విద్యాసంస్థలకు సెలవు..

AP Rains

Updated On : October 4, 2025 / 7:33 AM IST

AP Rains : తీవ్రవాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రెండు నదుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

పార్వతీపురం మాన్యం, విజయనగరం జిల్లాలోని పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లోకి వరద పోటెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాలా రిజర్వాయర్ల నుంచి నీరు విడుల చేయడంతో నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Also Read: Rains Alert : ముంచుకొస్తున్న తుపాను గండం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. కుండపోత వర్షాలకు చాన్స్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..

గొట్టా బ్యారేజీ నుంచి 1.04లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీపరివాహక ప్రాంతాల్లోని పది మండలాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

మరోవైపు.. నివంగా బ్రిడ్జి దగ్గర ఏపీ, ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి. వంశధార వరద ఉధృతి దృష్టా లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. తుంగతంపర, పాతూరు, లక్ష్మీపురం, గొట్ట, జిల్లేడుపేట గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని అధికారులు సూచించారు. పలుచోట్ల వంశధార నదికి గట్టు బలహీనంగా మారడం, కోతకు గురయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మరోవైపు ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు తెగిపోయ్యాయి. కొండచరియలు విరిగి పడడంతో ఏఓబీతో అనేక ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతంలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. వంశధార పరివాహక ప్రాంతంలో వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.