విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా మోసాలు: కేంద్ర సర్కారు

గత నాలుగేళ్లలో వచ్చిన ఫిర్యాదులపై ఎపీ పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది.

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా మోసాలు: కేంద్ర సర్కారు

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా మోసాలు జరుగుతున్నాయి. పార్లమెంటులో ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నాలుగేళ్లుగా ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదయ్యాయన్న విదేశాంగ శాఖ.

ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులను కూడా గత నాలుగేళ్లుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని వివరించింది. విదేశీ ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు కూడా ఈ నాలుగేళ్లలోనే ఎక్కువగా పెరిగారని కేంద్రం తెలిపింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు ఏజెంట్లు, సంస్థలు.

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు, సంస్థల జాబితాలో అగ్రస్థానంలో ఏపీ నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 3,042 మంది అక్రమ ఏజెంట్లు ఉంటే… వారిలో అత్యధికంగా… 498 మంది ఒక్క ఏపీలోనే ఉన్నారని కేంద్ర సర్కారు తెలిపింది. లోక్‌సభలో తెలుగుదేశం సభ్యులు హరీశ్ బాలయోగి, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌.

ఏపీ తర్వాత… ఉత్తరప్రదేశ్‌లో 418, తమిళనాడులో 372, మహారాష్ట్రలో 337, ఢిల్లీలో 299, పంజాబ్‌లో 209, కేరళలో 206, తెలంగాణ లో 123 మంది అక్రమ ఏజెంట్లు ఉన్నట్లు వెల్లడించింది. విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చిన పిర్యాదుల వివరాలు కూడా వెల్లడించింది విదేశాంగ శాఖ. 2021, 2022, 2023 సహా ఈ ఏడాది జూన్ వరకు నమోదైన వివరాలు బయటపెట్టింది. 2021లో 1553 ఫిర్యాదులు నమోదు కాగా, 2022లో 1227 పిర్యాదులు, 2023లో 1006 పిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది.

ఈ ఏడాది జూన్‌ వరకు… 575 విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాల ఫిర్యాదులు తమకు వచ్చినట్లు విదేశాంగ శాఖ లోక్‌సభకు చెప్పింది. ఈ సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1111, 688, 445, 261 ఫిర్యాదులు అందినట్లు సమాధానంలో పేర్కొంది. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులను… ఆయా రాష్ట్ర పోలీసులకు పంపించి… తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపింది విదేశీ మంత్రిత్వరాల శాఖ.

అనేక రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్‌ నమోదు చేయటం సహా… ఫిర్యాదులపై పోలీసుల చర్యలు ముమ్మరంగా ఉంటే… ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా పరిస్థితి ఉందని తెలిపింది. గత నాలుగేళ్లలో వచ్చిన ఫిర్యాదులపై ఎపీ పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది.

Also Read: 17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన సిసోడియా.. ఏమన్నారో తెలుసా?