APSRTC Cargo : ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు

కరోనా మహమ్మారి కారణంగా ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

APSRTC Cargo : ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు

Apsrtc Cargo

Updated On : August 31, 2021 / 7:20 PM IST

APSRTC Cargo Services : కరోనా మహమ్మారి కారణంగా ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడంతో మంచి లాభాలు వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్‌ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం 75 శాతం పెరిగింది.

మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్‌ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్‌ డెలివరీ అందిస్తున్న ప్రైవేట్ కొరియర్‌ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. గుంటూరు జిల్లాలో రోజుకు రూ.3 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్‌ 1 నుంచి కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.

ఆర్టీసీ కొరియర్‌ సేవలను ఇళ్లకే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో డోర్‌ డెలివరీ సేవలు సెప్టెంబరు 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపించాలన్నా, వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా బస్టాండ్‌లోని కొరియర్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు తమ ఇళ్ల వద్దే సేవలు పొందడానికి అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతానికి డోర్‌ డెలివరీని బుకింగ్‌ ఏజెంట్‌ కాంట్రాక్టర్లే చేయనున్నారు. ఆర్టీసీ బస్‌ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనం పెరుగనుంది. ఇక పార్శిళ్లకు ట్రాకింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దీంతో బుక్‌ చేసిన పార్శిల్‌ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్శిల్‌ కనిపించకుండా పోతే ఖాతాదారులకు పరిహారం లభిస్తుంది.

గుంటూరు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరుకు ప్రస్తుతం కొరియర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన చేనేత, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు, ఆటో మొబైల్‌ పరికరాలు, చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది.

గతేడాది ఏప్రిల్‌ నుంచి జులై మాసం మధ్య కాలంలో రూ.98.28 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది అదే సమయంలో రూ.172.17 లక్షలకు పైగా సమకూరింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా కార్గో కొంత వరకు ఆ నష్టాన్ని భర్తీ చేస్తోంది. అందుకే ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో డోర్‌ డెలివరీని కూడా అందుబాటులోకి తేవడానికి సిద్ధమయ్యారు.

సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటింటికీ కార్గో సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు ఆర్‌ఎం, ఎస్‌టీపీ రాఘవ కుమార్ తెలిపారు. మొదటగా గుంటూరు నగరం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 10 కేజీల వరకు డోర్‌ డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దశల వారీగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకూ అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.

కార్గో డోర్‌ డెలివరీ సేవలను కూడా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీకి కార్గో ద్వారా ప్రస్తుతం సరాసరి రోజుకు రూ.2 లక్షల ఆదాయం వస్తోందన్నారు. దీన్ని రూ.3 లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.