YS Viveka Case: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే
YS Viveka Case: అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

YS Viveka Case: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో అవినాశ్‌ను ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని ఇటీవలే సీబీఐని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
అదే రోజున అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తాము తుది తీర్పు ఇస్తామని హైకోర్టు ఇటీవలే తెలిపింది. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం అన్ని విషయాలనూ పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటివరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది.
అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో అవినాశ్‌ను ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, అలా చేస్తే అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం వరకు అవినాశ్ ను అరెస్టు చేయొద్దని కూడా సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అప్పటివరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం పడుతుందని ఇవాళ సీబీఐ తరఫు న్యాయవాదులు కూడా చెప్పారు. వివేక హత్య కేసులో ప్రలోభాలు కూడా వెలుగులోకి వచ్చాయని తెలిపారు.