ఏపీలోనూ ఉత్తమ లెజిస్లేటర్‌కు అవార్డు..! ఈ బడ్జెట్‌ సెషన్‌ నుంచే సభ్యుల ఎంపిక

పార్లమెంట్ సంప్రదాయాలపై అవగాహన ఉన్న, అనుభవజ్ఞులైన ప్రస్తుత, మాజీ సీనియర్ సభ్యుడు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులను కమిటీలో సభ్యులుగా నియమించడంపై చర్చ జరుగుతోంది.

ఏపీలోనూ ఉత్తమ లెజిస్లేటర్‌కు అవార్డు..! ఈ బడ్జెట్‌ సెషన్‌ నుంచే సభ్యుల ఎంపిక

Updated On : March 16, 2025 / 3:09 PM IST

అసెంబ్లీ.. ఒకప్పుడు అర్థవంతమైన చర్చలతో ఎంతో హుందాగా నడిచేది. కానీ ఇప్పుడు పాలిటిక్స్‌ కొత్త టర్న్ తీసుకుంటున్నాయ్. ఏ పార్టీ పవర్‌లో ఉంటే సభలో వాళ్లదే పైచేయి అవుతోంది. అంతేకాదు హద్దులు దాటి విమర్శలు..సభలో మాట్లాడని భాషను వాడుతుండటంతో చులకన భావం ఏర్పడుతోందంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్‌. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం, ఇప్పుడు సమస్యలపై చర్చిస్తున్నామంటున్నారు సీఎం చంద్రబాబు.

ఈ క్రమంలోనే ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఇచ్చినట్లే..ఏపీ అసెంబ్లీ లోనూ ప్రతీ సంవత్సరం ఉత్తమ లెజిస్లేటర్‌ను ఎంపిక చేసి అవార్డు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. అసెంబ్లీ సమావేశాల్లో అత్యున్నత ప్రతిభ, అట్రాక్టివ్‌ స్పీచ్‌లు, ప్రజా సమస్యలపై గళమెత్తే సభ్యులకు ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు ఇవ్వాలని భావిస్తోందట ఏపీ ప్రభుత్వం.

అందుకోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో భేటీ అయిన సీఎం చంద్రబాబు..వివిధ అంశాలపై చర్చించారు. అసెంబ్లీకి గత వైభవాన్ని తీసుకురావడానికి ఏమేమి చేయొచ్చనే దానిపై డిస్కషన్ జరిగిందట. అందులో భాగంగానే ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ఇస్తే బాగుంటుందని భావించి, దాన్ని అమల్లోకి తీసుకురావడానికి సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారట.

ఉత్తమ సభ్యులను ఎలా ఎంపిక చేయాలి.? ఇందుకోసం పార్లమెంట్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న విధానమేంటి.? అక్కడి ప్రాక్టీస్‌ను ఏపీ అసెంబ్లీలో ఎలా వర్తింపజేయవచ్చనే దానిపై చర్చించారట. ఉత్తమ లెజిస్లేటర్ ఎంపిక కోసం అసెంబ్లీలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు తెలిసింది. ఉత్తమ సభ్యుల ఎంపిక విధానాన్ని తీసుకురావడంతో సభ్యుల్లో హెల్దీ కాంపిటీషన్ పెంచొచ్చని భావిస్తున్నారట.

Also Read: కాంగ్రెస్‌ సస్పెన్షన్‌ అస్త్రం మిస్‌ ఫైర్ అయ్యిందా? టార్గెట్‌ ఓ ఎమ్మెల్యే అయితే.. వేటు మరొకరిపై పడిందా?

సభా మర్యాదలను విధిగా గౌరవిస్తూ, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తూ, సభ గౌరవాన్ని పెంచేలా వ్యవహరిస్తున్న సభ్యులను ఉత్తమ లెజిస్లేటర్‌గా సెలెక్ట్‌ చేయనున్నారు. సభ్యులు అడుగుతున్న ప్రశ్నల తీరు, ప్రశ్నోత్తరాల్లో, బిల్లులు, బడ్జెట్‌పై చర్చల్లో పార్టిసిపేషన్‌ను పరిశీలించనున్నారు. సభలో సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు, వాడుతున్న భాష, సహచర సభ్యులతో ఎలా వ్యవహరిస్తున్నారనే దానిపై కూడా ఆరా తీయనున్నారు.

సభా సమావేశాలకు హాజరవుతున్నారా లేదా.? ఒకవేళ వచ్చినా, పూర్తిస్థాయిలో సభా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా అనేది కూడా పరిగణలోకి తీసుకుంటారట. సభలోనే కాదు, అసెంబ్లీ కమిటీల్లో సభ్యుల పనితీరును విశ్లేషిస్తారు. మొత్తంగా సభలో, కమిటీల్లో వారి సమయపాలన ఎలా ఉంటుందో అన్నీ పరిశీలించి అవార్డుకు ఎంపిక చేస్తారు.

ఇలాంటి అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతీఏటా ఉత్తమ లెజిస్లేటర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఒకరినే ఉత్తమ సభ్యుడుగా ఎంపిక చేస్తారా? లేదా ఒకరికి మించి చేస్తారా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ అవార్డుకు సభ్యుల ఎంపిక, కమిటీ ఏర్పాటుపై త్వరలోనే స్పష్టత రానుంది.

పార్లమెంట్‌లో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఉత్తమ పార్లమెంటేరియన్లను ఎంపిక చేస్తోంది. అదే తరహాలో ఏపీ అసెంబ్లీలో సభ్యుల పనితీరును విశ్లేషించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీకి స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

పార్లమెంట్ సంప్రదాయాలపై అవగాహన ఉన్న, అనుభవజ్ఞులైన ప్రస్తుత, మాజీ సీనియర్ సభ్యుడు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులను కమిటీలో సభ్యులుగా నియమించడంపై చర్చ జరుగుతోంది. ఈ కమిటీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.