పశ్చిమలో టెన్షన్ : చింతమనేని ఇంటికి బాబు

పశ్చిమగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా దెందులూరు నియోజకవర్గానికి చెందిన నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 67 రోజుల పాటు చింతమనేని జైలులో ఉండి ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.
మూడు రోజుల పాటు జిల్లా టీడీపీ పార్టీ సమీక్ష సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు బాబు హాజరు కానున్నారు. దీంతో చింతమనేనిని పరామర్శించాలని బాబు నిర్ణయించారు. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు బాబు ఇక్కడకు చేరుకుంటారని టీడీపీ నేతలు 10tv కి తెలిపారు. కానీ…పోలీసులు అత్యుత్సాహంతో సెక్షన్ 30 యాక్టు అమలు చేస్తున్నారని ఆరోపించారు. చింతమనేని జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలిపారు. అంతేగాకుండా..ముందస్తు అరెస్టులు చేయడం దారుణమన్నారు.
మరోవైపు బాబు రాక సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చింతమనేని ఇంటి వద్ద కార్యకర్తలతో సందడి నెలకొంది. ఏలూరు సబ్ జైలులో ఉన్న చింతమనేనిని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌తో పాటు ఇతర కీలక నేతలు పరామర్శించిన సంగతి తెలిసిందే.
Read More : చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదు