జనసేన పార్టీలో బాలినేని చేరికకు లైన్ క్లియర్.. టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ కీలక హామీ
పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ కానున్న నేపథ్యంలో ఒంగోలుతోపాటు ప్రకాశం జిల్లా రాజకీయాలపై ఇరువురు మధ్య ఎటువంటి చర్చ సాగుతుందో అనే విషయంలో జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Pawan Kalyan and Balineni Srinivas Reddy,
balineni srinivas – TDP MLA Damacharla : మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బాలినేని భేటీ కానున్నారు. పవన్ తో భేటీ తరువాత బాలినేని జనసేన పార్టీలో ఎప్పుడు చేరతారనే విషయంపై క్లారిటీ రానుంది. ఇదిలాఉంటే.. జనసేన పార్టీలో చేరే విషయంపై పవన్ కల్యాణ్, బాలినేని మధ్య గత ఆరు నెలలుగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. బాలినేని అధికారంలో ఉన్నప్పుడు పలు అక్రమాలు, అవినీతికి పాల్పడినట్లు, వీటిపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలంటూ సిఎం చంద్రబాబుకు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అద్యక్షుడు రియాజ్ లు ఫిర్యాదు చేశారు. దీంతో బాలినేని జనసేన పార్టీలోకి వెళ్లకపోవచ్చని వైసీపీ నేతలు అంచనా వేశారు.
Also Read : భగవంతుడు చంద్రబాబును క్షమించడు, తిరుమల ప్రసాదంపై సీఎం వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం- వైసీపీ నేతలు
బాలినేని ఇటీవల పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. సుదీర్ఘ మంతనాలు అనంతరం పవన్ కల్యాణ్ తో బాలినేనిని ఫోన్లో నాగబాబు మాట్లాడించినట్లు తెలిసింది. ఫోన్లో బాలినేని మంతనాలు జరిపిన అనంతరం జనసేనలో చేరేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే బుధవారం బాలినేని వైసీపీకి రాజీనామా చెస్తున్నట్లు లేఖను విడుదల చేశారు. ఇవాళ తనతో భేటీ కావాలని పవన్ కల్యాణ్ సూచించడంతో బాలినేని హుటాహుటీన బుధవారం రాత్రికే అమరావతికి చేరుకున్నారు. బాలినేని జనసేన పార్టీలో చేరిక నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కు ఓ లేఖను సమర్పించారు. ఒంగోలులో రాజకీయ సమస్యలు తలెత్తకుండా తాను చూసుకుంటానని దామచర్ల జనార్దన్ కు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : వైసీపీని వీడుతున్న బొత్స ముఖ్య అనుచరులు.. ఎదురుదెబ్బేనా? లేక వ్యూహమా?
పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ నేపథ్యంలో ఒంగోలుతోపాటు ప్రకాశం జిల్లా రాజకీయాలపై ఇరువురు మధ్య ఎటువంటి చర్చ సాగుతుందో అనే విషయంలో జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బాలినేని రాజీనామాతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. బాలినేని అనుచరుడు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ బాలినేని వెంట జనసేనలోకి వెళ్లవచ్చుననే అనుమానంతో ఇప్పటికే చంద్రశేఖర్ ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడారు. మరోవైపు జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి జగన్ సూచించినట్లు తెలిసింది. జిల్లాలో బాలినేని వెంట ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు వైవీ సుబ్బారెడ్డిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దింపింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న కీలక ద్వితీయ శ్రేణి నాయకులతో వైవీ సుబ్బారెడ్డి నేరుగా ఫోన్లో మాట్లాడుతూ వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో వైసీపీ అధిష్టానం సాగిస్తున్న చర్చలు విఫలమై బాలినేని వెంట నడిచేందుకే అధికశాతం మంది ద్వితీయ శ్రేణి నేతలు మొగ్గుచూపితే జిల్లాలో వైసీపీ క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవటం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.