భూమా- గంగుల కుటుంబాల మధ్య మరో పోరు

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతం అంటే భూమా, గంగుల కుటుంబాల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుందని తెలిసిందే. ఎన్నికలున్నా లేకపోయినా ఆధిపత్యం కోసం పోరాటం సాగుతూనే ఉంటుంది. అలాంటిది ఎన్నికల సమయంలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మళ్లీ అక్కడ ఓ చిన్న ఎన్నిక జరగబోతోంది. నంద్యాల మిల్క్ డెయిరీ చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
గత ఏడాది డిసెంబర్ చివరికి చైర్మన్ పదవీ కాలం ముగిసింది. తొందర్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పదవిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని గంగుల కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. భూమా కుటుంబం నుంచి మాజీ మంత్రి అఖిల ప్రియ తన సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిని కో-ఆప్షన్ డైరెక్టర్‌గా చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ ఆ తర్వాత వెనక్కు తగ్గారు.
కో-ఆప్షన్ డైరెక్టర్‌గా వెనక్కు తగ్గడానికి కారణాలున్నాయని అంటున్నారు. నంద్యాల మిల్క్ డెయిరీలో మిగతా డైరెక్టర్లు వ్యతిరేకిస్తారనే అనుమానంతో పాటు జగత్ డైరీ భూమా వారిది కావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారట. భూమా కుటుంబం వ్యూహాత్మకంగా వ్యవహరించి, సమీప బంధువు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డిని డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. డైరెక్టర్ల పదవీకాలం ఐదేళ్లు. ప్రతి సంవత్సరం ముగ్గురు డైరెక్టర్లు పదవీ విరమణ పొందుతారు. వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు.
ఆ మూడింటిపై తీవ్ర పోటీ :
పదవీ విరమణ పొందిన మూడు డైరెక్టర్ల కోసం తీవ్రంగా పోటీ ఉంది. గంగుల విజయ సింహారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్‌డ్డి, భూమా నాగిరెడ్డి అన్న కుమారుడైన బీజేపీ నాయకుడు కిశోర్‌రెడ్డితో పాటు చాలా మందే పోటీ పడుతున్నారట. ఈ 15 మంది డైరెక్టర్లలో నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. గత 26 ఏళ్లుగా చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు పోటీ అనివార్యమయ్యే పరిస్థితి ఉందంటున్నారు. భూమా, గంగుల కుటుంబాలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయట. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందనన్న టెన్షన్ డైరెక్టర్లలో మొదలైంది.
నువ్వానేనా అంటూ సై:
ప్రస్తుతం ఉన్న 12 మంది డైరెక్టర్లలో భూమాకు అయిదుగురు, గంగులకు నలుగురు, మిగిలిన ముగ్గురు వేర్వేరు వర్గాలకు చెందిన వారు. కొత్తగా ఎన్నికయ్యే ముగ్గురు డైరక్టర్లే ఇప్పుడు కీలకం కాబోతున్నారు. అందుకే ఆ మూడు డైరెక్టర్ల కోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి. 26 ఏళ్లుగా భూమా నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికవుతున్నారు.
కానీ ఈసారి అలాంటి అవకాశం లేనట్లు కనిపిస్తోందని అంటున్నారు. పోటీ అనివార్యమని, నువ్వానేనా అనే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఈ పదవిని తమ వర్గానికే దక్కేలా చూసేందుకు ఒక వైపు భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, మరో వైపు గంగుల ప్రభాకర్ రెడ్డి, బిజేంద్రరెడ్డి, సుభాష్‌రెడ్డి రంగంలోకి దిగి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.