Free Bus Travel: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆ స్కీమ్‌కు పేరు ఖరారు..! జీరో ఫేర్ టికెట్ పై సిబ్బందికి ట్రైనింగ్
జీరో ఫేర్ టికెట్ ను ఎలా జారీ చేయాలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు.

Free Bus Travel: ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి రాబోతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించిన పేరు దాదాపుగా ఖరారైంది. ఈ స్కీమ్ కి స్త్రీ శక్తి అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే నమూనా టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రించనున్నారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీఎస్ఆర్టీసీ.
ఆర్టీసీ సిబ్బంది వినియోగించే టిమ్స్ యంత్రాలు, యూటీఎస్ సాఫ్ట్ వేర్ లో కూడా మార్పులు చేశారు. జీరో ఫేర్ టికెట్ ను ఎలా జారీ చేయాలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు. అన్ని బస్సు డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందికి శిక్షణ ఇస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్ పై ఛార్జీ, ఇచ్చిన రాయితీ వివరాలు ముద్రించబోతున్నారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందులో ముఖ్యమైనవది. త్వరలోనే రాష్ట్రంలో మరో స్కీమ్ అమల్లోకి రానుంది. ఎప్పుడెప్పుడా అని మహిళలు ఎదురుచూస్తున్న స్కీమ్ ఉచిత బస్సు పథకం. దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది.
ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తొలుత జిల్లాలకే పరిమితం చేయాలని భావించిన ప్రభుత్వం.. తర్వాత మనసు మార్చుకుంది. జిల్లాలకు పరిమితం చేస్తే మహిళలకు పెద్దగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది.
ఉచిత బస్సు పథకాన్ని ఏ బస్సుల్లో అమలు చేస్తారు? ఏయే గుర్తింపు కార్డులు కావాలి? అనేదానిపై ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వివరాలు వెల్లడించారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటుగా నగరాల్లోని సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. అల్ట్రా డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత బస్సు పథకం అమలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఈ పథకం కింద బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఈ జీరో ఫేర్ టికెట్ల మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణిస్తున్నారనే వివరాలతో పాటుగా.. ఉచిత బస్సు పథకం అమలు వల్ల ఆ మహిళకు ఎంత మేరకు లబ్ది చేకూరిందనే వివరాలనూ పొందుపరచనున్నారని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుల సాయంతో మహిళలు ఉచితంగా బస్సుల్లో జర్నీ చేయొచ్చని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.