Sadineni Yamini : జగన్ హయాంలో హిందువులు బాధపడని రోజే లేదు : సాధినేని యామిని
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ కు మళ్లించవచ్చని బై లాస్ లో ఉందా అని ప్రశ్నించారు. టీటీడీ విరాళాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

Sadineni Yamini
Sadineni Yamini – Jagan : సీఎం జగన్ పై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో హిందువులు బాధపడని రోజే లేదని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. ప్రతి రోజూ హిందూ మనోభావాలు దెబ్బతింటూనే ఉన్నాయని తెలిపారు. తిరుమల వెంకన్నకు వైసీపీ ప్రభుత్వం ధూప దీప నైవేద్యాలు కూడా అందనివ్వదేమోననే ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. తిరుమల వెంకన్నను భవిష్యత్తులో ఒంటరిగా నిలబెట్టేస్తారేమోనని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీటీడీని వైసీపీ ధార్మిక ధనార్జన కేంద్రంగా మార్చుకున్నారని ఆరోపించారు. తిరుపతి కార్పోరేషన్ శానిటరీ సిబ్బందికి దేవస్థానానికి వచ్చే విరాళాల్లో నుంచి కేటాయింపులు చేస్తారా అని ప్రశ్నించారు. టీటీడీ విరాళాల్లో నుంచి తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ జీతాల నిమిత్తం ఒక శాతం నిధులు తీసుకోవాలని నిర్ణయించే అధికారం ఉందా అని నిలదీశారు.
భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని శానిటరీ కోసం తిరుపతి కార్పోరేషన్ పరిధిలో పారిశుద్ధ్యానికి వినియోగిస్తారా అని అడిగారు. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తుల వల్ల తిరుపతిలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని, ఆదాయం వస్తోందని తెలిపారు. ఆ ఆదాయంతో శానిటరీ సిబ్బందికి జీతాలివ్వచ్చు కదా అని సూచించారు. స్మార్ట్ సిటీ కింద తిరుపతికి రూ. 2 వేల కోట్లు నిధులు కేటాయించినా టీటీడీ నిధులే కావాలా అని అడిగారు.
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ కు మళ్లించవచ్చని బై లాస్ లో ఉందా అని ప్రశ్నించారు. టీటీడీ విరాళాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. భూమన తన కొడుకును గెలిపించుకునేందుకు టీటీడీ సొమ్ము వాడతారా అని నిలదీశారు. భక్తులిచ్చే విరాళాలను ధార్మిక కార్యక్రమాల నిమిత్తం కాకుండా వేరే వాటికి మళ్లిస్తారా అని ప్రశ్నించారు. ధార్మిక కార్యక్రమాలు జరపకూడదనే టీటీడీ విరాళాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.