తిరుమల కొండపై చర్చి నిర్మించడం లేదు – సుబ్రమణ్య స్వామి

బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన..TTD పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం తిరుమలకు వచ్చారాయన. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుమల కొండపై చర్చి నిర్మిస్తున్నారనేది అవాస్తవమని, ఇలాంటి దుష్ర్పచారాలు జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వారే ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. టీటీడీలో గత ఐదు సంవత్సరాలుగా జమా ఖర్చులు ఆడిట్ చేయలేదని, వెంటనే స్వతంత్ర సంస్థతో ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆడిట్ లేకపోవడం వల్ల భక్తులు సమర్పించే కోట్ల రూపాయాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీటీడీపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉండకూడదని తాను గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని, ఇందులో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకా మండలిలో పలు రంగాలకు చెందిన సభ్యులు ఉండడం శుభపరిణామం అంటూనే..దేవస్థానం భూములు, నిధులు కాపాడటంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. మదర్సాలు, చర్చీలపై జోక్యం చేసుకోని ప్రభుత్వం…హిందూ ఆలయాలపై ఎందుకు జోక్యం చేసుకొంటోందని ప్రశ్నించారు.
టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధాన దీక్షితులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించారు. దీనిని సుబ్రమణ్యస్వామి స్వాగతించారు.
Read More : అదుపు తప్పితే ఊరుకోం : రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు