గోదారి గట్టుపై కమలం స్కెచ్చేంటి? ఈ దిశగా అడుగులు

ఇలా బిజెపి లిస్టులో వరుసగా గోదావరి జిల్లాలోని సీనియర్ నేతలకు అదృష్టం దక్కుతుండడంతో నెక్స్ట్ ఎవరు, ఎవరిని ఆ అదృష్టం వరించబోతుందని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారట.

గోదారి గట్టుపై కమలం స్కెచ్చేంటి? ఈ దిశగా అడుగులు

Daggubati Purandeswari

Updated On : May 15, 2025 / 8:50 PM IST

గోదావరి జిల్లాలే టార్గెట్ గా బిజెపి రాజకీయం చేస్తుందా..? గోదారి గట్టుపై కాషాయం కంటున్న కలలు ఫలిస్తాయా.? మొన్న వర్మ, నిన్న సోము వీర్రాజు, నేడు పాకా..మరి నెక్స్ట్ విధేయుడు ఎవరు.? లోక్ సభ, రాజ్యసభతో పాటు శాసన మండలిలోనూ ప్రత్యేక స్థానం దక్కించుకోవడానికి కారణాలేంటి.? గోదావరి జిల్లాలో బిజెపికి అన్ని సామాజిక వర్గాల్లో పట్టు దక్కినట్టేనా..? ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా ఇక్కడే పాగా వేయడానికి కారణం అదేనా? వాచ్ దిస్ స్టోరీ.

ఏపీలో ఎక్కడ ఎన్నికలొచ్చినా ఉభయగోదావరి జిల్లాలో నడిచే రాజకీయంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇక్కడ ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వారే రావడం పరిపాటిగా మారింది. అందుకే మొన్న టిడిపి అయినా, ఆ తర్వాత వైసిపి అయినా, ఇప్పుడు కూటమిలో జనసేన కలిసినా,..ఈ జిల్లాలే టార్గెట్ గా సీట్లు అత్యధికంగా సాధించి అధికారంలోకి వచ్చాయి.

అయితే ఇక్కడ గతం ఎంతో ఘన చరిత్ర ఉన్న బీజేపీ..ఇప్పుడు పూర్వ వైభవాన్ని సాధించేందుకు గోదావరి గట్టుపై కాషాయం జండా ఎగరేసేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిందన్న ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో వరుసగా కీలక పదవులు ఇస్తూ వస్తున్న బిజెపి అధిష్టానం, పార్టీలో పనిచేసిన సీనియర్ నేతలుగా మాత్రమే కాకుండా ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కో నేతను ఎంచుకొని కీలక సామాజిక వర్గాల్లో పట్టు సాధించే దిశగా ఇక్కడ అడుగులు వేస్తోందట.

గోదావరి జిల్లాలో ప్రధానంగా కాపు, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలతో పాటు బీసీ వర్గం కూడా అత్యధికంగా రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా కమ్మ సామాజికవర్గానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి గెలుపొందడం, ఆ తర్వాత ఆమె పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు. అటు మిత్రపక్షమైన టీడీపీలో కూడా ఇదే సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతో బిజెపికి సపోర్ట్ వచ్చినట్లు అయింది.

భీమవరం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి పెద్దపీట
ఆ తర్వాత అనపర్తిలో కూడా బిజెపి జెండాను ఎగురవేసేందుకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో ఆయన గెలిచారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు పల్నాడు వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే నల్లమిల్లినే. ఇక నరసాపురం పార్లమెంట్లో పట్టు సాధించేందుకు బీజేపీ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస వర్మకు నరసాపురం ఎంపీ సీటిచ్చి, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. భీమవరం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో ఆ వర్గం అంతా తొలినుంచి బిజెపివైపే ఉందన్న టాక్ విన్పిస్తోంది.

ఇక కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు వంటి సీనియర్ నేతకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సీనియారిటీకి పట్టం కట్టింది బీజేపీ. ఇక రాజ్యసభ సీటును పాక సత్యనారాయణకు కట్టబెట్టడంతో గోదావరి జిల్లాలోని బీసీ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయట. పాక సత్యనారాయణ లాంటి మిత్రుడికి న్యాయం చేసేందుకు అటు సోము వీర్రాజు, ఇటు శ్రీనివాస వర్మలు ఇద్దరూ బిజెపి అధిష్టానం వద్ద పావులు కదిపారన్న టాక్ విన్పిస్తోంది.

ఇలా కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి, బిసి సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలకు గోదావరి జిల్లాల నుంచి లోక్ సభ, రాజ్యసభ, కేంద్ర క్యాబినెట్, శాసనసభ, శాసనమండలిలోనూ సముచిత స్థానం కల్పిస్తూ..ఆయా జిల్లాల్లో బీజేపీ బలోపేతానికి పనిచేసేలా చాణిక్యత ప్రదర్శిస్తుందట అధిష్టానం. పొత్తులు ఉన్నా, లేకున్నా రాబోయే రోజుల్లో బిజెపి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుందట.

ఇలా బిజెపి లిస్టులో వరుసగా గోదావరి జిల్లాలోని సీనియర్ నేతలకు అదృష్టం దక్కుతుండడంతో నెక్స్ట్ ఎవరు, ఎవరిని ఆ అదృష్టం వరించబోతుందని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారట. ఎన్డీఏ కూటమి పొత్తులో ఉన్నప్పటికీ పార్టీ బలోపేతానికి ఖచ్చితమైన ప్రణాళికతో దూసుకెళ్తున్న బిజెపి అధిష్టానం..వరుస పదవులు ఇవ్వడం ద్వారా గోదావరి జిల్లాల్లో బలోపేతం అవుతుందా..? గోదారి గట్టుపై కమలం జెండా ఎగరవేయగలుగుతుందా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.