Breaking : రాజధాని గ్రామంలో మరో రైతు మృతి

  • Published By: madhu ,Published On : January 19, 2020 / 02:35 AM IST
Breaking : రాజధాని గ్రామంలో మరో రైతు మృతి

Updated On : January 19, 2020 / 2:35 AM IST

రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెలగపూడి ప్రాంతానికి చెందిన రైతు అప్పారావు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి ఉద్యమంలో కొడుకు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టారని, ఆ మనస్థాపంతోనే అప్పారావు మృతి చెందాడని బంధువులు వెల్లడిస్తున్నారు. 
 

మూడు రాజధానుల ప్రకటన, GN RAO, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికల అనంతరం రాజధాని గ్రామాల్లో ఆందోళనలు పెల్లుబికాయి. రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, ఇతర ప్రజా సంఘాలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 30 రోజులకు పైగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. కమిటీలు ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ ప్రభుత్వంతో పలుసార్లు సమావేశాలు జరిపింది. ఈ క్రమంలో 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగనున్నాయి. అంతకంటే ముందు..కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీలో రాజధానిపై చర్చించిన అనంతరం కీలక ప్రకటన చేయనుంది. 

మూడు రాజధానులే ముద్దు అంటోంది సీఎం జగన్ సర్కార్. రెండు కమిటీల నివేదికలు, హైపవర్ కమిటీ అధ్యయనం తర్వాత సీఎం జగన్ ఫైనల్‌గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులు నష్టపోకుండా చూడాలని సిఎం జగన్ భావిస్తున్నారు. రైతులతో పాటు 29 గ్రామాల్లో ఉన్న రైతు కూలీల సంక్షేమం పట్ల కూడా క్యాబినెట్ లో చర్చించనున్నారు.

రైతులకు, రైతు కూలీలకు గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన సాయం కంటే రెట్టింపు చేయాలన్న భావనలో జగన్ ఉన్నారు. రైతులకు ఇచ్చే కౌలు, రైతు కూలీలకు ఇచ్చే పింఛను పెంచే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చ జరగనుంది. అసైండ్ భూముల రైతులకు కూడా సమన్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకోనుంది.

Read More : NSA నీడలో ఢిల్లీ : జాతీయ భద్రత చట్టం..గరిష్టంగా 12 నెలల తరబడి నిర్భందం