Srinivas Goud : తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్ర వాళ్లకే ఎక్కువ మేలు జరిగింది- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదన్న శ్రీనివాస్ గౌడ్.. ఇప్పుడున్న పరిస్థితిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు.

Srinivas Goud : తిరుమలలో తెలంగాణ వారి పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దైవ దర్శనం విషయంలో వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. తిరుమల అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు గౌరవిస్తారని చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఏర్పాటుతో తెలంగాణ వాళ్ల కంటే ఆంధ్రా వాళ్లకే ఎక్కువ మేలు జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో వ్యాపారాలు, కాంట్రాక్టులు అన్నీ ఆంధ్రా వాళ్ల చేతుల్లోనే ఉన్నాయన్నారు. గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదన్న శ్రీనివాస్ గౌడ్.. ఇప్పుడున్న పరిస్థితిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు.
”రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరన్స్ లు లేకుండా కలిపిన దాంట్లో మా ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలక మండలి కూడా ఉంది. ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగాయి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు, ఆ తర్వాత జగన్ వచ్చినప్పుడు కూడా కొనసాగించారు. కానీ, ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే.. తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణకు సంబంధించిన వ్యాపారవేత్తలకు కానీ.. ఇక్కడ కొంత డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు.
టీటీడీ పాలక మండలి అంటే మాకు చాలా గౌరవం ఉంది. తిరుపతి దేవుడు అంటే ప్రపంచానికే దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రాన ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకోవడానికి వీలు లేదు. అలా చేస్తే దేవుడి కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి.
తెలంగాణ ప్రజలకు, ఏపీ ప్రజలకు.. తెలంగాణ నాయకులకు, ఏపీ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఈక్వల్ గా ప్రాధాన్యత ఉండాలి. కానీ, ఇక్కడ చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, వీఐపీలకు కానీ, సామాన్యులకు కానీ బేధం కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని సరి చేయాల్సిన బాధ్యత ఉంది.
విడిపోయిన తర్వాత మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ది పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే హైదరాబాద్ లో. కాంట్రాక్టర్లు చూసినా వాళ్లే ఉన్నారు. బిల్డర్లు చూసినా వాళ్లే ఉన్నారు. ఆర్థికంగా బలపడిన వారిలోనూ వాళ్లే ఉన్నారు. మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుని మేము బాగుపడదాము అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్లే బాగుపడ్డారు. ఇంత వ్యత్యాసం ఉంటుందని పదేళ్ల తర్వాత చూస్తున్నాం” అని సీరియస్ అయ్యారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Also Read : ఫార్ములా ఈ-కార్ రేస్ స్కామ్‌లో సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు..