Krishna District : కృష్ణా జిల్లాలో వీడిన మిస్టరీ.. కెనాల్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతదేహం లభ్యం
కారు ఉన్న చోటు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కలవారిపాలెంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లుగా ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు.(Krishna District)

Krishna District
Krishna District – Car In Canal : కృష్ణా జిల్లా పెద్దపులిపాక వద్ద కెనాల్ లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మిస్టరీ వీడింది. కెనాల్ లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తోటవల్లూరు మండలం కలవారిపాలెం వద్ద మృతదేహం దొరికింది. మృతుడిని అవనిగడ్డకు చెందిన గాజుల రత్న భాస్కర్ గా గుర్తించారు. రత్న భాస్కర్ ను అతడి ఇంట్లో పని చేసే వ్యక్తి గుర్తించింది. రత్న భాస్కర్ ను హత్య చేసి కెనాల్ లో పడేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అవనిగడ్డ నియోజకవర్గంలోని 5వ వార్డుకు చెందిన గాజుల రత్న భాస్కర్.. ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బంటుమిల్లి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పాడు. సోమవారం నాడు ఉదయం విజయవాడ-అవనిగడ్డ రూట్ లో ఉన్న కెనాల్ లో కారు కనిపించింది. అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ద్వారా ఓనర్ ను గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడికి అప్పుల బాధలు ఉన్నాయని, చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
కారు ఉన్న చోటు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కలవారిపాలెంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లుగా ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి నిన్ననే చనిపోయాడని, బాడీ కుళ్లిపోయి ఉంది. పోలీసులు రత్న భాస్కర్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డెడ్ బాడీని చూసి అది రత్న భాస్కర్ దే నని గుర్తించారు. దీనిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రత్నభాస్కర్ బంటుమిల్లి వెళ్తున్నట్లు చెప్పాడు. మరి విజయవాడ ఎందుకు వచ్చాడు? ఇక, డెడ్ బాడీ మెడ మీద, శరీరంపై గాయాలను గుర్తించారు.