చలో లంబసింగి.. ఆంధ్రా ఊటీలో శీతాకాలం అందాలు

Chalo Lammasingi Andhra Ooty : ఆంధ్రా ఊటీగా పేరున్న లంబసింగిలో శీతాకాలం అందాలు అదిరిపోతున్నాయి. రారమ్మంటూ టూరిస్టుల్ని ఆహ్వానిస్తున్నాయి. ప్రకృతి సోయగాల్ని చూసేందుకు క్యూ కడుతున్న పర్యాటకులు… చల్లటిగాలులు, పూల సోయగాల మధ్య పరవశించిపోతున్నారు. వందల వాహనాల రాకతో లంబసింగిలో ట్రాఫిక్‌జామ్ తప్పట్లేదు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు… అందంగా కురిసే మంచు తుంపరులు.. వణికించే అతిచల్లని గాలులు.. వలస పూల సోయగాలు.. ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.. అంతా ప్రకృతి సోయగాల మయం. వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రకృతి అందాల్ని చూస్తూ మైమర్చిపోవాలంటే ఏ స్విట్జర్లాండ్‌కో… కనీసం కశ్మీర్‌కు వెళ్లాల్సిన పనిలేదు. ఏపీలోని లంబసింగికి వెళ్తే సరిపోతుంది. విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది లంబసింగి.
ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి దీనికి. ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో సున్నా డిగ్రీలు… లేదా అంతకంటే అంత కంటే తక్కువగా నమోదైతాయి. మిగతా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆంధ్రా ఊటీ అందాల్ని చూసేందుకు ఎక్కడెక్కడి ప్రకృతి ప్రేమికులు లంబసింగి దారిపడుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే పర్యాటకులతో జాతరని తలపిస్తోంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ కొంతమంది పర్యాటకులు కట్టెలు, కిరోసిన్ వెంట తెచ్చుకుని మరీ చలిమంట వేసుకుంటున్నారు. యువతీ యువకులు ఆ నెగళ్ల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తున్నారు.
ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో… పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో ప్రకృతి అందాల బ్యాక్ డ్రాప్‌తో సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు తీసుకుంటూ హడావుడి చేస్తున్నారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు లంబసింగికి తరలిరావడంతో ఈ మార్గంలో రహదారులు కిక్కిరిసి పోతున్నాయి. తెల్లవారుజామునే వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరడంతో లంబసింగిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కశ్మీరాన్ని తలపించే లోయలు ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు, పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.
మన్యం ఏరియాలో ఉండటంతో కొండలు, అడవులు దాటుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇరువైపులా లోయలు… మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా శీతాకాలంలో లంబసింగిలో మంచు వర్షం కురుస్తుంది. రెగ్యులర్‌గా ఉదయం 6 అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకు దర్శనం ఇస్తాడు. వేసవిలో మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు. లంబసింగిలో ప్రతిరోజూ మధ్యాహ్నం మూడింటికే సూర్యుడు సన్నబడిపోతాడు. సాయంత్రం ఐదారింటికి చలి ప్రారంభమవుతుంది.