Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నిక.. బనకచర్లపై కీలక వ్యాఖ్యలు..
పార్టీ అధినేతగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు వర్ల రామయ్య.

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు ఎన్నికైనట్టు ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య మహానాడు వేదికగా ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైటన్లు ఆయన తెలిపారు. తొలిసారిగా 1995లో పార్టీ పగ్గాలు అందుకున్నారు చంద్రబాబు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.
కడపలో జరుగుతున్న మహానాడులో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు అరుదైన గౌరవం దక్కింది. పార్టీ అధినేతగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు వర్ల రామయ్య. టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుని హోదాలో వర్ల రామయ్యకు ఆ అవకాశం కలగింది. తనకు ఈ అవకాశం కల్పించినందుకు టీడీపీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన వర్ల రామయ్య.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అధ్యక్ష పదవి ఏకగ్రీవం అవుతోంది. కడప మహానాడులో భాగంగా పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియలో చంద్రబాబు మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో అధ్యక్షుడిగా ఆయన పేరు ప్రకటన లాంఛనమైంది.
”మరోసారి జాతీయ అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జీవితంలో ఎన్నడూ చూడని మహానాడు కడపలో జరిగింది. తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వరుణుడు సైతం మహానాడుకు సహకరించాడు. మహానాడు బహిరంగ సభ దిగ్విజయంగా జరగబోతోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలన కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
పోలీసు శాఖను నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం. చట్టాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం. తప్పు చేసిన వారిపట్ల చండశాసనుడిగా ఉంటా. ప్రాజెక్టుల నిర్మాణాలకు కట్టుబడి ఉన్నాం. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి హారతి ఇస్తా. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే. తెలంగాణకి గోదావరి జలాలతో ఎలాంటి నష్టం జరగనివ్వను. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రాయలసీమ రుణాన్ని తీర్చుకుంటా” అని చంద్రబాబు అన్నారు.
మహానాడు వేదికగా తెలుగు రాష్ట్రాల గురించి సీఎం చంద్రబాబు కీలక ప్రస్తావన చేశారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అంటూ కామెంట్ చేశారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదన్నారు చంద్రబాబు. ఏపీ చివరి రాష్ట్రంగా ఉందని, సముద్రంలో కలిసే జలాలను సద్వినియోగం చేసుకుంటున్నామని స్పష్టం చేశారాయన. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ తో తెలంగాణ రాష్ట్రానికీ మేలు జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు.
”ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ అందించే సత్తా ఏపీకి ఉంది. విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. విద్యుత్ చార్జీలు పెంచి అధికారం కోల్పోయింది వైసీపీ. గత ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని వైసీపీ చూస్తోంది. విద్యుత్ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం దిశగా సూర్యఘర్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. తెలుగుదేశం శ్రేణులంతా ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ లు పెట్టుకోవాలి” అని పిలుపునిచ్చారు చంద్రబాబు.