Payyavula Keshav : చంద్రబాబు మరింత స్ట్రాంగ్ అయ్యారు, ఆయన ఏం చెప్పారంటే- పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు
ఈ అరెస్టును రాజకీయ కుట్ర కోణంలోనే ప్రజలు చూస్తున్నారు. ఇందులో అవినీతి కోణం ప్రజలు చూడడం లేదు. Payyavula Keshav

Payyavula Keshav
Payyavula Keshav : చంద్రబాబు జైల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మీడియాలో చూసి తెలుసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండండి అని చంద్రబాబు సూచించారని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
”చంద్రబాబు నన్ను చూసిన వెంటనే ఏం కేశవ కృష్ణా జలాల పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మీడియాలో చూసి తెలుసుకుంటున్నారు చంద్రబాబు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండండని చెప్పారు. పార్టీ ఎలా? రాష్ట్రం ఎలా? ప్రజలు ఎలా? అనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.
Also Read : టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్ రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?
ఇరిగేషన్ రంగంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ అరెస్టును రాజకీయ కుట్ర కోణంలోనే ప్రజలు చూస్తున్నారు. ఇందులో అవినీతి కోణం ప్రజలు చూడడం లేదు. తెలుగుదేశం పార్టీని డిస్టర్బ్ చేయడం కోసమే ఈ కేసులన్నీ పెట్టారు. 57 దేశాల్లో చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు నిలిచారు. ఈ సంఘటనతో తెలుగుదేశం పార్టీ మరింత ధృడంగా తయారైంది. చంద్రబాబు అరెస్ట్ నాకు తెలియదని సీఎం జగన్ అనడం హాస్యాస్పదం. చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు” అని పయ్యావుల కేశవ్ అన్నారు.
చంద్రబాబు నాతో ఏమన్నారంటే- పయ్యావుల కేశవ్..
”చంద్రబాబుని రాజకీయంగా దెబ్బతీయాలని అనుకున్నారు. కానీ, చంద్రబాబు మరింత బలంగా తయారయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చంద్రబాబు తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఎప్పటికప్పుడు పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు. నన్ను జైల్లో పెట్టినందుకు నిరసన తెలిపాము అది అయిపోయింది. ప్రజా సమస్యలపై పోరాటం ఆపొద్దు అని చెప్పారు.
మనదొక రాజకీయ పార్టీ. మనకు ప్రధాన లక్ష్యం ప్రజా సంక్షేమమే అనేది దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, మీ మార్గం ఎప్పుడూ ప్రజలకు చేరువగా ఉండాలి, ప్రజలతోనే సాగాలి, సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు తన గురించి కానీ, కేసుల గురించి కానీ ఆలోచన చేయలేదు. ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తాను అనే ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. పార్టీ ఎలా? ప్రజలు ఎలా? రాష్ట్రం ఎలా? అనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారు.
Also Read : చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబుని జైల్లో చూసి కాస్త బాధ కలిగినా.. చంద్రబాబులో ఉన్న కాన్ఫిడెన్స్ చూశాకు మాకు ధైర్యం వచ్చింది. చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా, బోల్డ్ గా ఉన్నారు. చంద్రబాబు మారలేదు. ఎప్పటిలానే ఉన్నారు అని స్పష్టంగా కనపడింది. కృష్ణా జలాల అంశం మీద చంద్రబాబు ఆరా తీశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు చెప్పారు. దాని మీద ప్రజల్లోకి నేను వెళ్లి పోరాటం చేస్తుంటే, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్ ప్రభుత్వం భయపడి అక్రమ కేసులు పెట్టిందని చంద్రబాబు నాతో చెప్పారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలను నేను ఎండగతాను, నన్ను కట్టడి చేయకుంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే భయంతోనే నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు అని చంద్రబాబు చెప్పారని” పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
చంద్రబాబు కుటుంబసభ్యులు నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లారు పయ్యావుల కేశవ్. వారితో కలిసి చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యారు.