ఖబడ్దార్.. ఆలయాల జోలికొస్తే నాశనమైపోతారు

రామతీర్థంలో రాములోరి విగ్రహం ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం అవుతోంది. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కిన వాతావరణంలో చంద్రబాబు.. విజయసాయిరెడ్డి ఒకే రోజు అక్కడకి చేరుకోవడంతో రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే రాముడికి ఇంత అవమానం జరిగితే జగన్ ఏం చేస్తున్నారు? అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. ఖబర్దార్ అంటూ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు చంద్రబాబు.
ఆలయాల జోలికి వస్తే నాశనం అయిపోతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడి తలను నరికారంటే వారిని మనుషులే అని అనాలా? అంటూ.. వైసీపీ పాలనలో వ్యవస్థలు అన్నీ కుళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారాలు చేస్తున్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అని విమర్శించారు. ఆలయాలను కాపాడే బాధ్యత జగన్ రెడ్డికి లేదా? అంటూ ప్రశ్నించారు.
శ్రీరాముడిని కాపాడే బాధ్యత సీఎం జగన్‌కు లేదా? ఈ సీఎంని నరరూప రాక్షసుడు అనాలా? ఏమనాలి? అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి జగనే కారణమని దుయ్యబట్టారు. నా హయాంలో మసీదు, చర్చిలపై దాడులు జరిగాయా? దేశమంతా జై శ్రీరామ్ నినాదం మార్మోగుతుంటే.. ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తల నరికారు. పోలీసులు తమాషా చూస్తున్నారా? కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారు.’’ అంటూ చంద్రబాబు విమర్శించారు.
ఇది పులివెందుల రాజకీయం అనుకుంటున్నారా? 19 నెలల్లో 127 దేవాలయాలపై దాడులు జరిగాయని, దేవాలయాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని , దేవుడి ఆస్తుల జోలికి వస్తే ఖబడ్దార్.. మసైపోతారని చంద్రబాబు హెచ్చరించారు.