చంద్రబాబు వైజాగ్ టూర్ వెనుక అసలు ప్లాన్..!

ప్రజా చైతన్యయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మూడు రాజధానులంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత టీడీపీ ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అది అమరావతి అంటూ ప్రచారం చేస్తోంది. 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు పూర్తి స్థాయి అండగా నిలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జేఏసీ నేతలతో కలిసి అమరావతి ఉద్యమం కోసం భిక్షాటన కూడా చేశారు. వివిధ జిల్లాల్లో పర్యటించి 3 రాజధానులకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటనపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఆయనకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందనే అంశంపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.
అధికార వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం శరవేగంగా పనులు కొనసాగిస్తోంది. టీడీపీ మాత్రం విశాఖను రాజధానిగా ఒప్పుకొనేది లేదని చెబుతోంది. ఇప్పటికే అమరావతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, రైతులు 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని, వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, మధ్యలో ఈ మూడు రాజధానుల గోల ఏంటని వైసీపీపై విమర్శలు గుప్పిస్తోంది టీడీపీ. రాజధాని వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
వైసీపీ ఎదురుదాడి :
అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ టీడీపీ ఉద్యమాలు చేస్తుంటే, విశాఖకి పరిపాలన రాజధాని వస్తుంటే టీడీపీ ఓర్వలేకపోతోందని వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. ఉత్తరాంధ్ర బాగుపడటం చంద్రబాబుకి ఇష్టం లేదని, దమ్ముంటే అక్కడ పర్యటించాలని, ప్రజలు చీపురుకట్టలతో బుద్ధి చెబుతారని తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు అంటే విశాఖవాసులకు ప్రేమాభిమానాలు ఉన్నాయని, అలానే విశాఖ అంటే చంద్రబాబుకు కూడా ఇష్టమని అంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు.
విశాఖ పర్యటనపై బాబు ఫోకస్ :
ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన సాఫీగా సాగిపోతే వైజాగ్‌లో రాజధానికి ప్రజల్లో అనుకూలత లేదనే ప్రచారం జరుగుతుందని, అందుకే ఈ పర్యటనను అడ్డుకుని తీరాలని వైసీపీ ప్లాన్ వేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట. అధికార పార్టీ ఎందుకు వైజాగ్‌లో రాజధాని పెట్టాలనుకుంటున్నదీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖలో జరుగుతున్న ల్యాండ్ సెటిల్మెంట్లను సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టేందుకు రెడీ అయ్యారు బాబు. ఉత్తరాంధ్రకీ తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, తన హయాంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని ప్రజలముందు పెట్టబోతున్నారు. హుద్‌హుద్ సమయంలో కకావికలమైన వైజాగ్‌ను ఎలా అభివృద్ధి చేశానన్నదీ చెప్పబోతున్నారట.
ఇదే సరైన సమయమని :
అదానీ గ్రూప్, లాలూ గ్రూపులను కష్టపడి విశాఖకు తీసుకువస్తే ఈ ప్రభుత్వం ఏవిధంగా వెళ్లగొట్టిందనే అంశాలను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు బాబు. ముఖ్యంగా ల్యాండ్ మాఫియా పై సాక్ష్యాధారాలను సేకరించి అవన్నీ ప్రజల ముందు పెట్టబోతున్నారు. విశాఖలో సామాన్య ప్రజలకు సంబంధించిన ఆస్తులను భయపెట్టి ఏ విధంగా స్వాధీనం చేసుకుంటున్నారో చంద్రబాబు వివరించబోతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తాము చేసే ఆరోపణలన్నింటీకీ సాక్ష్యాధారాలు ఉన్నాయని, విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో చంద్రబాబు వాటిని ప్రజల ముందు పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇన్ని రోజులు ఉత్తరాంధ్ర పర్యటనకు ఆసక్తి చూపని చంద్రబాబు.. ఇదే సరైన టైమ్‌గా భావించి అధికార పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారని అనుకుంటున్నారు. మరోపక్క, రెండు పార్టీల నేతల కామెంట్స్ వింటుంటే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు.
Read More>>కొంచెం ఇష్టం..కొంచెం కష్టం: జనసేనకు దగ్గరగా లేను,దూరంగానూ లేను: రాపాక