Cm Chandrababu: జగన్‌వి ఊసరవెల్లి రాజకీయాలు.. అమరావతిపై విషం చిమ్మారు- సీఎం చంద్రబాబు
జగన్ కి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ.
Cm Chandrababu: అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రానికి పంపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాజధానులు కోల్పోవటం, విమర్శలు, వివక్షత, అవమానాలు.. తెలుగు వాళ్ళం దశాబ్దాలుగా భరిస్తూనే వచ్చామని సీఎం చంద్రబాబు వాపోయారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళంలో ఉన్నామన్నారు.
విభజన సమయంలో సమన్యాయం చేయాలని నేను కోరితే, ఇప్పుటి వైసీపీ నాయకుడు నాడు పార్లమెంటులో ఉండి కెమెరాల నుంచి తప్పించుకు తిరిగారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించామన్నారు. అమరావతి, హైదరాబాద్ దేశంలో ఒకటి రెండు స్థానాల్లో ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.
ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తే ఇక ఇబ్బంది ఉండదనే ఈ తీర్మానం అని వివరించారు.
”కష్ణా-గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించారు. బ్రిటిష్ మ్యూజియంలోని అమరావతి గ్యాలరీలో ఆనాటి చరిత్రను భద్రపరిచారు. అంతటి ప్రాచీన, ఘన చరిత్ర కలిగి సంస్కృతి సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగు నేల ఇది. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రాభవం కోల్పోయాం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులు అనే పేరు మనకు వచ్చింది.
పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించింది. 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయి. పదేళ్లు ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా త్వరితగతిన సొంత రాజధాని నిర్మాణం చేయాలని ఇక్కడికి వచ్చాం. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రాజధాని అమరావతికి బేషరతుగా మద్దతిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఊసరవెల్లి రాజకీయాలు చేశారు” అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
”జగన్ కి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ. అమరావతిపై విషం చిమ్మి నిర్మాణాలు ఆపేశారు. అమరావతి రాజధానికి ఆనాడు జగన్ మద్దతు తెలిపారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. జగన్ వి ఊసరవెల్లి రాజకీయాలు” అని విరుచుకుపడ్డారు చంద్రబాబు.
Also Read: అమరావతే రాష్ట్ర శాశ్వత రాజధాని, ప్రజా రాజధాని.. అందుకే చంద్రబాబుకు మద్దతు తెలిపా- పవన్ కల్యాణ్
