సీఎం చంద్రబాబు కామెంట్స్‌తో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు.. విస్తరణ పక్కానా? ఇన్‌ ఎవరు? ఔట్ ఎవరు?

పనితీరు ఆధారంగా పదవులు కల్పించడం, సామాజిక, ప్రాంతీయ న్యాయం, కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వడం..ఇవన్నీ సీఎం లక్ష్యాలని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు

సీఎం చంద్రబాబు కామెంట్స్‌తో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు.. విస్తరణ పక్కానా? ఇన్‌ ఎవరు? ఔట్ ఎవరు?

Updated On : July 10, 2025 / 9:05 PM IST

పదే పదే చెప్తున్నా..అయినా మీ తీరు మారడం లేదు. దూకుడుగా పనిచేయరు. శాఖలపై అవగాహన పెంచుకోరు. విపక్షంపై స్ట్రాంగ్‌గా వాయిస్ వినిపించరు. ఇలా అయితే ఇష్టమంటూ..క్యాబినెట్‌ మీటింగ్‌లో మంత్రుల తీరు సీరియస్ అయ్యారట సీఎం చంద్రబాబు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చాలామంది వెంటనే గట్టిగా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారట.

మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయట్లేదని ముఖం మీదే చెప్పేశారట. 50శాతం మంది మంత్రులు చాలా విషయాల్లో వెనకబడ్డారని చెప్పారట. మంచి పనుల్ని ప్రజలకు చెప్పలేరా.? సందర్భానుసారంగా వెంటనే స్పందించలేరా అంటూ చురకలు అంటించినట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగుపరచుకోకపోతే వేటు తప్పదనే మెసేజ్ ఇచ్చారట చంద్రబాబు. దీంతో క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయ్. ఖాళీగా ఉన్న ఒక్క బెర్త్‌ను భర్తీ చేయడంతో పాటు ఇప్పటికే క్యాబినెట్‌లో ఉన్న కొందరికి ఉద్వాసన పలుకుతారన్న టాక్ బయలుదేరింది.

Also Read: HCAపై అందుకే ఫిర్యాదు చేశాం.. ఇన్ని తప్పులు జరిగాయి: TCA జనరల్ సెక్రటరీ

చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇంకో అమాత్య పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేయడమా.? లేక మళ్లీ కొన్ని మార్పులు చేస్తారా.? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే 24 మంది మంత్రుల్లో 18మంది వరకు ఫస్ట్ టైమ్ మినిస్టర్స్. ఇందులో చాలామంది పనితీరుపై సీఎం చంద్రబాబు గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయ్.

ఖాళీగా ఉన్న ఒక బెర్తు నాగబాబుకు
ఈ క్రమంలో విస్తరణ పక్కా అనే చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న ఒక బెర్తును నాగబాబుకు ఇస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆయనను ఇంకా క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. ఇక బీజేపీ కూడా మరో మంత్రి పదవిని కోరుతోందట. తమకు క్యాబినెట్‌లో ఒకే బెర్త్ ఇచ్చారని..రెండో పదవి కావాలంటున్నారట కమలనాథులు.

ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు బీజేపీకి రెండో మంత్రిపదవిపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో జనసేనతో ఉన్న బంధాన్ని బలోపేతం చేయడం కోసం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయంపై కూడా స్పష్టత రావచ్చు. అయితే ఇప్పటికే క్యాబినెట్‌లో ఉన్న ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరుపై అయితే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు, ముగ్గురికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటారని అంటున్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం కల్పించే యోచనలో చంద్రబాబు ఉన్నారట. కాపు సామాజిక వర్గానికి విస్తరణలో పెద్దపీట వేస్తారని కూడా చెప్పుకుంటున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా జనసేన బలపడుతుందనేది ఓ పాయింట్ అయితే..బీజేపీకి రెండో మంత్రి పదవి ఇస్తే కేంద్రంతో బంధాలు మెరుగవుతాయన్నది మరో అంచనా.

ఇద్దరు, ముగ్గురే కాదు అవసరమైతే సగం మంది మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇంకా ఆలస్యం చేసి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక..మార్పులు, చేర్పులు చేసే బదులు..ఇప్పుడే క్యాబినెన్ షఫ్లింగ్ చేసి రెండో ఏడాది పాలనను పరుగులు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు.

పనితీరు ఆధారంగా పదవులు కల్పించడం, సామాజిక, ప్రాంతీయ న్యాయం, కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వడం..ఇవన్నీ సీఎం లక్ష్యాలని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి నూతన ఉత్తేజాన్ని, మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నమన్న చర్చ జరుగుతోంది. నిజంగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందా.? అమ్యాతులపై చంద్రబాబు ఆగ్రహానికి..క్యాబినెట్ విస్తరణకు సంబంధం ఉందా లేదా అనేది వేచి చూడాలి మరి.