ఉచిత ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్.. మంత్రులకు వార్నింగ్..

3 నెలలు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇకపై అలా ఉండకూడదని మంత్రులతో తేల్చి చెప్పారు.

ఉచిత ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్.. మంత్రులకు వార్నింగ్..

Cm Chandrababu On Sand (Photo Credit : Google)

Updated On : October 16, 2024 / 5:29 PM IST

Cm Chandrababu : క్యాబినెట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రులతో భేటీ అయ్యారు. అంతర్గతంగా వారితో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఉచిత ఇసుక ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల జోక్యంపై తేల్చేందుకు 18న పార్టీ సమావేశం పెట్టినట్లు చెప్పారు. రవాణ ఛార్జీలు తప్ప లబ్దిదారులకు ఇతర ఛార్జీలు ఏవీ ఉండొద్దన్నారు. ఇంఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు చంద్రబాబు.

ఎవరైనా వచ్చి వారే ఇసుక తవ్వుకుని తీసుకెళ్తామంటే, ఎలాంటి రుసుము వసూలు చేయకూడదన్నారు సీఎం చంద్రబాబు. 3 నెలలు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇకపై అలా ఉండకూడదని మంత్రులతో తేల్చి చెప్పారు. కాగా, ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. ట్రాక్టర్ మీద వెళ్లినా, పక్క ఊరు నుంచి ఇసుక తెస్తున్నా ఆంక్షల పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ నిబంధనలు ఎవరు పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రివర్గ సమావేశం అనంతరం నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పై చర్చ జరిగింది. రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయ్ షీట్స్ తెరిస్తే బాగుంటుందని మంత్రుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. జనం ముoదు గంజాయి బ్యాచ్ కి సామాజిక సేవా శిక్షలు వేస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దొంగలున్నారు జాగ్రత్త అని వివిధ పబ్లిక్ ప్రదేశాల్లో ఫోటోలు డిస్ ప్లే చేస్తున్నట్లు గంజాయ్ బ్యాచ్ ఫోటోలు పెడితే బాగుంటుందని మంత్రి అనిత సూచించారు. క్యాబినెట్ ఆమోదించిన వివిధ పాలసీలపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి దిక్సూచిలా వివిధ పాలసీలు ఉన్నాయని కితాబిచ్చారు.

ఇసుక విషయంలో ఎమ్మెల్యేల పాత్రపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే, 18న సమావేశం ఏర్పాటు చేశానని, ఇందులో ఒక్కొక్కరి అంతు తేలుస్తానని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ఎమ్మెల్యేలను కట్టడి చేసే బాధ్యత ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు అక్రమ ఇసుక దందా మొదలు పెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే కాకుండా మిత్రపక్షాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇసుక దందా చేస్తున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చిన నేపథ్యంలో.. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు ఇసుక దందా చేయకుండా బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండాలని ఇంఛార్జ్ మంత్రులకు స్పష్టం చేశారు చంద్రబాబు.

Also Read : వాళ్లు చెబితేనే బాలినేని జనసేనలోకి వెళ్లారా? ఆ భయంతోనే వైసీపీని వీడారా?