Cm Chandrababu: ఒక్కొక్కరికి రూ.3వేలు.. నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు..
ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు.

Cm Chandrababu: తూర్పుగోదావరి జిల్లా ప్రజావేదికలో నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ భృతికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. సూపర్ 6 పథకాలకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపాయలు ఇస్తామంది. చదువు పూర్తయి ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాల్లో 3వేలు చొప్పున జమ చేయనుంది సర్కార్.
తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సూపర్‌సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ‘తల్లికి వందనం కింద 10 వేల కోట్లు జమ చేశాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. త్వరలో నిరుద్యోగ భృతి 3వేలు ఇస్తాం’ అని చంద్రబాబు చెప్పారు.
ఎన్డీయే కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పేదల సేవలో ఉండే కార్యక్రమం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం హయాంలో అధికార యంత్రాంగానికి జీతాలు, పేదలకు పెన్షన్లు సమయానికి వచ్చేవి కావన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తేమీ కాదన్న ఆయన.. నవ్యాంధ్రలో 9ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశానని చెప్పారు. అభివృద్ధికి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా గతంలో చెప్పా..ఆ దిశగా మందుకు వెళ్తున్నామన్నారు చంద్రబాబు.
పేదలను చులకనగా చూస్తే వదిలిపెట్టను అని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. మనం చేసేది సేవా భావంతో చూడాలి అని అన్నారు. తెలంగాణలో ఆదాయం ఉన్నా.. పెన్షన్ల విషయంలో ఏపీతో పోటీలో దరిదాపుల్లో కూడా లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నూటికి 13 శాతం మందికి పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.
Also Read: సింగయ్య మృతికేసు.. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు భారీ ఊరట..
”గత వైసీపీ ప్రభుత్వం పాలనలో పోలవరాన్ని భ్రష్టు పట్టించారు. కాపర్ డ్యామ్ పనులు చేయకుండా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 2027కి పోలవరాన్ని జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటాం అని మంత్రి నిమ్మలకు చెప్పాను. పోలవరం ప్రాజెక్ట్ మాములు ప్రాజెక్ట్ కాదు. ఎక్కడా లేని విధంగా 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. డిసెంబర్ కి డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది. ఇప్పటికీ 85శాతం పనులు పూర్తయ్యాయి. కనీవిని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు చేస్తాము. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
ఐదేళ్లు అరాచకాలు చేశారు. ఇబ్బంది పెట్టారు. దివ్యాంగుల పెన్షన్లను కబ్జా చేశారు. రాష్ట్రంలో గంజాయి సేవించే వాడు, డ్రగ్స్ వాడే వాడు, తల్లికి చెల్లికి భార్యకు తేడా తెలియకుండా ఉంటున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఈ భూమి మీద చివరి రోజు అని స్పష్టంగా చెప్తున్నా. పోలీసులు సీసీ కెమెరాల పెట్టి తప్పు చేసే వాడిని పట్టుకోవాలి. రౌడీయిజాన్ని ఉపేక్షించను. 9 లక్షల 50 వేల కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో పెట్టుబడులు వచ్చాయి. దీంతో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 2029కి పేదరికం లేని కుటుంబం.. సంపాదించే మార్గం ఉండాలని P4 పథకానికి శ్రీకారం చుట్టాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.