Cm Chandrababu: పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించండి.. ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గించండి- కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో..

Cm Chandrababu: పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించండి.. ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గించండి- కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

Updated On : June 15, 2025 / 7:33 PM IST

Cm Chandrababu: టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గించాలని కోరారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్రమంత్రికి కీలక వినతులు చేశారు. హెచ్ డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు.

బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు సీఎం చంద్రబాబు.

Also Read: ఏడాది కింద ఏపీలో ఓ చరిత్ర.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఎలా సాగింది?

ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలన్నారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని.. తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం చంద్రబాబు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం.. కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీ ఫుడ్ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావం చూపుతోందన్నారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలన్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు పీయూష్ గోయల్ కు చెప్పారు చంద్రబాబు.

గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. ఆయనకు కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి భరత్ స్వాగతం పలికారు. పొగాకు బోర్డు అధికారులతో పీయూష్ గోయల్ సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబుతో మంచి వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధిపై‌ జరిగిన సమావేశం ఆశాజనకంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. పోర్టులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో రూ.1.6 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వెల్లడించారు. కొత్త ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. పరిమితికి మించి పొగాకు సాగు చెయ్యవద్దని పీయూష్ గోయల్ సూచించారు. గత నాలుగేళ్లలో పొగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. పొగాకు రైతుల సమస్యల‌ పరిష్కారానికి చర్యలు చేపట్టామని చెప్పారు.