ఏడాది కింద ఏపీలో ఓ చరిత్ర.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఎలా సాగింది?

అద్భుత విజయమే కాదు.. అంతకుమించిన అంచనాలతో కూటమి సర్కార్ ఏర్పాటయింది.

ఏడాది కింద ఏపీలో ఓ చరిత్ర.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఎలా సాగింది?

Updated On : June 15, 2025 / 5:16 PM IST

మార్పునకు మాత్రమే కాదు.. చరిత్రకు ఏడాది. సరిగ్గా ఇదే రోజు.. ఏపీ రాజకీయం ఓ మలుపు తీసుకుంది. చరిత్ర చూడని.. చరిత్ర గుర్తుంచుకునే ఫలితాన్ని ఇచ్చింది. అద్భుతమైన మెజారిటీతో కూటమి సర్కార్ ఏర్పాటయింది. అభివృద్ధి ఆగేది లేదు.. ఇచ్చిన హామీని మరిచేది లేదు అన్నట్లుగా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. సుపరిపాలనే లక్ష్యంగా.. జనాలకు సంక్షేమం అందించడమే ధ్యేయంగా పెట్టుకుంది. మరి ఈ ఏడాది పాలన ఎలా సాగింది.. కూటమి సర్కార్‌ హయాంలో కనిపించిన మార్పులేంటి..

సరిగ్గా ఏడాది కింద.. ఏపీలో ఓ చరిత్ర క్రియేట్‌ అయింది. చరిత్ర ఊహించని ఫలితం కనిపించింది. వైసీపీని చిత్తు చేస్తూ.. కూటమి భారీ విజయాన్ని సాధించింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కని స్థాయిలో.. కూటమి ప్రభంజన కొనసాగింది. టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన NDA కూటమి.. 175 నియోజకవర్గాలకు 164 స్థానాల్లో విజయం సాధించింది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీ.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.

అద్భుత విజయమే కాదు.. అంతకుమించిన అంచనాలతో కూటమి సర్కార్ ఏర్పాటయింది. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన వేళ.. రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయ్‌. విలక్షణమైన పాలనాతీరుతో.. ఏడాదిలో జనాలకు మరింత చేరువయింది కూటమి సర్కార్‌. మంత్రిత్వ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకూ.. మూడు పార్టీల మధ్య పరస్పర అవగాహనతో పాలన సాగుతోంది.

Also Read: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో ఏడాదిలో ఇన్ని పనులు చేశాం: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ.. అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అంటూ… తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను సీఎం చంద్రబాబు మొదట్లోనే క్లారిటీ ఇచ్చారు. కేంద్రం సహకారంతో.. ఏపీని అభివృద్ధి పథంలో నిలపడంపై దృష్టిసారించారు. 2024-25లో GSDP వృద్ధి రేటులోనూ.. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ.. ఏపీ అద్భుతమైన వృద్ధి సాధించింది. 8.21 శాతం వృద్ధిరేటుతో… దేశంలో రెండోస్థానంలో, తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానంలో ఏపీ నిలిచింది.

15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు
జనాలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి.. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆధునికతను అందిపుచ్చుకొని అద్భుత వ్యూహంతో రెండంకెల వృద్ధి రేటు సాధించి నవ్యాంధ్రను ప్రగతిపథం బాట పట్టించేందుకు కష్టపడుతున్నారు.

వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా కీలక విభాగాల్లో తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు.. మెరుగైన ఫలితాలనిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పడేస్తున్నాయ్‌. 2024-25లో రాష్ట్రం 8.21 శాతం వృద్ధిరేటుతో 8.65 లక్షల కోట్ల GSDP సాధించిందని కేంద్రం లెక్కలు చెప్తున్నాయ్‌. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15.41 శాతం వృద్ధిరేటు నమోదైంది.

వ్యవసాయ రంగంలో 22.98 శాతం, ఉద్యాన రంగంలో 21.29, పారిశ్రామిక రంగంలో 6.4, నిర్మాణ రంగంలో 10.28, ఉత్పాదక రంగంలో 15.18, సేవలు 11.82, విద్య, ఆరోగ్యం 12.15, వాణిజ్యం, హోటళ్లు, ఇతర రంగాల్లో 11.58 శాతం వృద్ధి నమోదైంది. రియల్‌ ఎస్టేట్స్‌, ఇతర రంగాలు 11.22 శాతం నమోదు చేశాయ్‌. 2024-25లో తలసరి ఆదాయంలో 11.89 శాతం వృద్ధి నమోదైంది. తలసరి రాబడి 2లక్షల 66వేల 240కు చేరింది. తలసరి ఆదాయం విభాగంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో నిలిచింది.

తొలి ఏడాదిలోనే కూటమి సర్కార్‌ ఎన్నో విజయాలు సాధించింది. అధికార పీఠం ఎక్కే సమయానికి ఆర్థిక సమస్యలు వెంటాడినా.. ఇచ్చిన మాట విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు కూటమి సర్కార్‌. పింఛన్ పథకంపై ముందడుగు వేశారు. అప్పటి వరకూ అమలవుతున్న 3వేల పెన్షన్‌ను ఒక్కసారిగా వెయ్యి పెంచి 4 వేలను అందించారు. ఇక దివ్యాంగులకు ఇచ్చే 3 వేల పింఛనును 6 వేలకు పెంచేశారు. పెన్షన్లకే ఏడాదికి 34 వేల కోట్లు… ఐదేళ్లలో లక్షా 70వేల కోట్లు ఖర్చు చేయబోతోంది.

ఇక జగన్ సర్కార్‌లో నిలిచిపోయిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. 204 అన్న కాంటీన్లను నెలకొల్పి.. సగటున రోజుకు 3 లక్షల మంది ఆకలి తీరుస్తోంది. దీపం 2 పథకం ప్రారంభించి… 2025 మార్చినాటికి తొలి విడతగా కోటీ 15 లక్షల మందికి ఉచిత సిలిండర్‌ అందించింది. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు 2వేల 684 కోట్ల వ్యయం కాగా.. ఐదేళ్లలో ప్రభుత్వంపై 13వేల 423 కోట్ల భారం పడనుంది.

వీటన్నింటికి మించి.. రాష్ట్రం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన.. సూపర్‌సిక్స్‌లోకి కీలకమైన హామీ అమలుకు.. ఏడాది సంబరాల వేళ సిద్ధం అయింది కూటమి సర్కార్‌. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. 67లక్షల మందికి.. తల్లికి వందనం పథకం నిధులు ఖాతాల్లో జమ కాబోతున్నాయ్‌. ఎంతమంది పిల్లలు ఉంటే.. అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు దీన్ని అమలు చేస్తున్నారు. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలవుతోంది. కూటమి సర్కార్ యానివర్సిరీకి.. జనాలకు గిఫ్ట్ లభించినట్లు అయింది.