తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
లడ్డూ కల్తీ వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు.

Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో ఘటనపై వివరణ ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావుని ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. లడ్డూ వివాదంపై రివ్యూ నిర్వహించారు.
ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
లడ్డూ కల్తీ వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతోంది. లడ్డూ ప్రసాదం కల్తీ చేశారన్న వార్తతో కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో అనేక కల్తీలు జరిగాయన్న అంశం తీవ్ర దుమారం రేపింది. తిరుమలలో జరిగిన అపచారంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అంటున్నారు. తిరుపతి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు ఉన్నాయని, అపవిత్ర పదార్ధాల వాడారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
Also Read : వైసీపీలో చివరికి మిగిలేది ఎందరు? జగన్ పార్టీ భవితవ్యం ఏంటి?
ఎట్టి పరిస్థితుల్లో తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలకు చరమగీతం పాడతామని, తిరుమల పవిత్రను కాపాడతామనే మేసేజ్ ను కూటమి ప్రభుత్వం ఇస్తుందనే సందేశం పంపుతున్నారు సీఎం చంద్రబాబు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైదిక, ధార్మిక పరిషత్తుల్లో చర్చించి చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.