Chandra Babu Birthday: అభివృద్ధి రుషి.. ప్రజల మనిషి సీఎం చంద్రబాబు.. ఆయన ప్రజా జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.

Chandra Babu Birthday: అభివృద్ధి రుషి.. ప్రజల మనిషి సీఎం చంద్రబాబు.. ఆయన ప్రజా జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు

Chandra Babu

Updated On : April 20, 2025 / 2:10 PM IST

Chandra Babu Birthday: క్రమశిక్షణ, దూరదృష్టి, వ్యూహ చాతుర్యంతోడు నిత్యం ప్రజలకు మంచిచేయాలనే తపనతో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన దార్శనికుడిగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. ఆదివారం చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అన్నిరంగాల ప్రముఖులు, ప్రజలు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1950, ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు జన్మించారు. చంద్రబాబు తండ్రి కర్జూరనాయుడు గ్రామ పెద్దల్లో ఒకరు. నాన్న ప్రభావంతో చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు అబ్బాయి. స్కూల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవారు. చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయిన చంద్రబాబు.. క్యాంపస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.

 

ఆర్థికశాస్త్రంలో పీజీ చేశాక, అదే యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉంటూనే చంద్రబాబు రాజకీయాలవైపు అడుగులు వేశారు. తొలిసారిగా 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తద్వారా 28ఏళ్ల వయసులోనే యువ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో చంద్రబాబు కాలు మోపారు. 1980-1983 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్ననీటి పారుదల తదితర శాఖలకు మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలోనే తన అభిమాన హీరో నందమూరి తారకరామారావును చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు.

 

చంద్రబాబు క్రమశిక్షణ, వ్యక్తిత్వం ఎన్టీఆర్‌కు నచ్చడంతో 1981లో తన కూతురు భువనేశ్వరితో పెళ్లి జరిపించారు. ఆ తరువాత 1982లో కాంగ్రెస్ నుంచి మరోసారి పోటీ చేసిన చంద్రబాబు ఓటమిపాలయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ టికెట్‌పై 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పట్నుంచీ ఆ నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోటగా మారింది. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. తొలి టర్మ్ లోనే ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, పచ్చదనం – పరిశుభ్రత వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

 

చంద్రబాబు ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట రోడ్లను శుభ్రం చేయించడం మొదలు పెట్టారు. గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాలు పేద మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పులు తెచ్చాయి. శాసనసభ సమావేశాలను ప్రజలు తిలకించాలనే ఉద్దేశంతో పాతికేళ్ల క్రితమే ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. అలా, ‘లైవ్‌’లో అందించిన మొదటి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు అమల్లోకి తెచ్చిన ‘డయల్‌ యువర్‌ సీఎం’ ప్రోగ్రామ్‌ ఎంతో ప్రాచుర్యం పొందింది.

 

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగే ఇబ్బంది నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే క్రమంలో 46 రకాల సేవలను ఒకేచోట అందించే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఈ-సేవను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ‘విజన్‌ 2020’తో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారు. ఐఎస్‌బీ, ఐఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ను ఒప్పించి అమెరికా వెలుపల తొలి మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంను హైదరాబాద్ లో ఏర్పాటు చేయించిన ఘనత చంద్రబాబుది.

 

2003లో తిరుమల బ్రహ్మోత్సవాలవేళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా, అలిపిరి వద్ద మందుపాతరల పేలుళ్లలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ఆయనకు అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం హయాంలో తొమ్మిదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చింది చంద్రబాబు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి.. అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు చంద్రబాబు కృషి చేశారు. అయితే, 2019లో ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన చంద్రబాబు.. మళ్లీ 2024 ఎన్నికల్లో నాల్గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధానిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు.. ఏపీని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.