అన్నదాత సుఖీభవ.. రైతుల అకౌంట్లలో రూ.7000 వేయడానికి డేట్ ఫిక్స్.. సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

Annadata Sukhibhava
Annadatha Sukhibhava: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తయింది. ఈ సమయంలో ఎన్నికల హామీల అమలుపైన వరుసగా నిర్ణయాలు తీసుకుంటుంది. తల్లికి వందనం పథకంను ఇవాళ్టి (జూన్12) నుంచి అమలు చేస్తున్న ప్రభుత్వం.. అందుకు సంబంధించిన నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకంపై స్పష్టం వచ్చింది.
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈనెల 20వ తేదీనుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.15,000 నేరుగా నగదు మద్దతుగా అందించడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో జమ చేయనుంది.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20వ విడతకు సంబధించిన నిధులను ఈనెల 20న విడుదల చేసేందుకు సిద్ధమైంది. అదే రోజున ఏపీ ప్రభుత్వం తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను (రూ.5వేలు) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో మొత్తం రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.