కూతురు కన్నీళ్లు పెట్టుకోవటం చూసి పవన్ కళ్యాణ్ బాధపడ్డారు : సీఎం చంద్రబాబు

వైసీపీకి 11 కాదు ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడానికి అర్హత లేదు.. అసలు రాజకీయాల్లో ఉండటానికి కూడా అనర్హులు అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూతురు కన్నీళ్లు పెట్టుకోవటం చూసి పవన్ కళ్యాణ్ బాధపడ్డారు  : సీఎం చంద్రబాబు

CM Chandrababu naidu

Updated On : November 7, 2024 / 1:57 PM IST

CM Chandrababu Naidu: విద్యుత్ చార్జీలు పెంచమని, ప్రజలపై భారం వేయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం తాళ్లాయపాలెంలో రాష్ట్రంలో తొలి గ్యాస్ ఆధారిత సబ్ స్టేషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు లేకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవాళ శంకుస్థాపన చేసిన పనులు ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో విద్యుత్ సరఫరా సమస్య లేకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. మేము అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది.. మీరు ఆ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టారని చంద్రబాబు అన్నారు.

Also Read: రణరంగంగా మారిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ.. దాడిచేసుకున్న ఎమ్మెల్యేలు.. వీడియోలు వైరల్

గత ప్రభుత్వ పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం లాలూచీ పడి విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి చేశారని అన్నారు. దుర్మార్గపు ఆలోచనలతో విద్యుత్ ఒప్పందాలను జగన్ రద్దు చేశారు. పీపీఏల రద్దుపై కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదు. వాడని విద్యుత్ కు రూ. 9వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32,166 కోట్ల భారం మోపారని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ఒక్కో ఇటుక పేర్చుతున్నామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో రూ. 10లక్షల కోట్ల అప్పులు చేశారు. ఖజానా ఖాళీ చేశారు. ఒక్క రూపాయి కూడా గల్లా పెట్టెలో లేదు. ఉపాధి హామీ పథకం నిధులుకూడా దారి మళ్లించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి నాటికి గ్రామీణ రోడ్లలో గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు.

Also Read: ఉత్పత్తి రంగం అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం.. చాలా పెద్ద సంస్థలు ఏపీకి వస్తున్నాయి : మంత్రి నారా లోకేశ్

వైసీపీకి 11 కాదు ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడానికి అర్హత లేదు.. అసలు రాజకీయాల్లో ఉండటానికి కూడా అనర్హులు అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు అహంకారం నెత్తికెక్కింది.. నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.. ఆడబిడ్డలపైనా విపరీత పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అభివృద్ధికి ఆటంకంగా వైసీపీ నేతలు మారారు.. అభివృద్ధి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.. కానీ, మాపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హద్దులు మీరి పోస్టులు పెడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. హద్దుమీరి ప్రవర్తిస్తున్న వారు ఒక ఖబడ్దార్ జాగ్రత్త.. చట్టాలన్నీ అధ్యయనం చేసి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తామ్.. కొవ్వు పెరిగిన వాళ్ల కొవ్వు కరిగిస్తాం అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఏ చట్టం చెప్తోంది.. ఇంట్లో ఆడబిడ్డల కన్నీటి కారకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? బాంబులకు భయపడని వాడిని అసెంబ్లీలో నా భార్యను అవమానించారని కన్నీరు పెట్టుకున్నా. కూతురు కన్నీళ్లు పెట్టుకోవటం చూసి పవన్ కళ్యాణ్ బాధపడ్డారు. రాజకీయ ముసుగులో నేరస్థులు చలామణి అవుతుండటం వల్లే ఇన్ని అనర్ధాలు. అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే, సోషల్ మీడియా పోస్టులతో మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.