జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసింది- హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు..

బ్రిటీష్ వాళ్లు భారత్‌కి వచ్చి పరిపాలించిన తరహాలో.. మనం కూడా ప్రపంచ దేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలుతాం.

జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసింది- హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు..

Cm Chandrababu Naidu (Photo Credit : Facebook)

Updated On : November 16, 2024 / 8:02 PM IST

Cm Chandrababu Naidu : హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితంపై ఆయన స్పందించారు. 53 రోజుల జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసిందన్నారు చంద్రబాబు. జైల్లో ఉన్న ఆ 53 రోజులు.. ఎక్కడా నిరాశకు గురి కాలేదని, ధైర్యం కోల్పోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

”టెలికాం రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్ట్ ఇచ్చా. దాన్ని అమలు చేయడం వల్ల టెలికాం రంగం వృద్ధి చెందింది. సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానాన్ని తీసుకొస్తున్నాము. వాట్సాప్ గవర్నన్స్ ద్వారా ప్రజలకు చేరువగా, సులువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాము. దీని ద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది మా లక్ష్యం. ఈ యుగంలో సమాచారమే ఓ పెద్ద నిధి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు సాధించవచ్చు.

ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చు. గతంలో నేను బ్రేక్ సైలెన్స్- టాక్ ఎబౌట్ ఎయిడ్స్ అనే నినాదాన్ని ఇచ్చా. ఇప్పుడు బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్ మెంట్ అని పిలుపునిస్తున్నా. ఇప్పుడు చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైంది. ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోంది. సాధారణంగా ఇది 2.1 శాతం కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు.

ప్రస్తుతం బోర్డర్ లైన్‌లో జననాల రేటు ఉంది. ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మన దేశంలో కూడా మొదలవుతుంది. భారత దేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్ మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టే వారే ఉండరు. మనం ఒక ప్రణాళికాబద్దంగా అమల్లోకి తీసుకొస్తే.. 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పని చేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారు.

బ్రిటీష్ వాళ్లు భారత్‌కి వచ్చి పరిపాలించిన తరహాలో.. మనం కూడా ప్రపంచ దేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలుతాం. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టా. ఇప్పుడు ఆ నిబంధన తొలగించి… కనీసం ఇద్దరు పిల్లలు ఉంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలని చెపుతున్నా. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. దానికి అనుగుణంగా.. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1వ తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.

తెలుగుదేశం పార్టీ తొలి నుంచి దేశ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించింది. దేశాభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. బీజేపీకి వాజ్ పేయి పునాదులు వేస్తే, నరేంద్ర మోదీ బలోపేతం చేశారు. మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతుంది. రానున్న రోజుల్లో ప్రపంచంలో భారత దేశం రెండు, మూడు స్థానాల్లో ఉంటుంది. నరేంద్ర మోడీ మా నాయకుడు. ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తాము. హర్యానా సీఎం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సీఎంల సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలనే విషయంపై మోదీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు.

ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాము. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపించింది. ఎన్డీయే కూటమిపై జనానికి భరోసా కలిగింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేము ముందుగానే ఊహించాము. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 57 శాతం ఓట్లు.. 93 శాతం సీట్లు కూటమికి ప్రజలు ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను కలిపారు. దాని ఫలితం ఇప్పుడు చూశాము. జాతీయ స్థాయిలో కూడా బిజెపికి పూర్తి మెజారిటీ వస్తుందని అనుకున్నాం.

కూటమిలో ఎటువంటి సమస్యలు లేవు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాము. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వ హననం జరుగుతుంది. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో మమ్మల్ని మాత్రమే కాదు. సొంత తల్లిని, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్న వాళ్ళని ఏం చేయాలి? వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా? సోషల్ మీడియాలో మహిళలని వేధించే వారిని ఎలా నియంత్రిచాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి.

అక్రమ కేసులు పెట్టి 53 రోజులు నన్ను వేధించారు. చేయని తప్పునకు జైలు శిక్ష అనుభవించాను. 45 ఏళ్ళ పాటు ఎన్నో ప్రజా ప్రయోజన విధానాలు తీసుకురావడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల కోసమే పని చేశాను. అక్రమ కేసులకు గురి కావటం బాధించినా.. 53 రోజులు ఎక్కడా నిరాశకు గురి కాలేదు. ధైర్యం కోల్పోలేదు. 53 రోజుల జైలు జీవితం.. మరింత పట్టుదల పెరిగేలా చేసింది. ఆ పట్టుదలను ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండాలనేది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read : ఏపీలో త్వరలో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ యాక్ట్..! అసలేంటీ చట్టం, టార్గెట్‌ ఎవరు?