జలదిగ్బంధంలో విజయవాడ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
విజయవాడ కలెక్టరేట్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు.
Cm Chandrababu Naidu : భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ అతలాకుతలమైంది. బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరం సాధారణ స్థితికి వచ్చే వరకు కలెక్టరేట్ లోనే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సీఎంతో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అక్కడే ఉండనున్నారు. కాగా.. క్షేత్రస్థాయి తీవ్రతను తన దృష్టికి తీసుకురావడంలో కొందరు అధికారులు విఫలమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ రాత్రి విజయవాడ కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు బస చేయబోతున్నారు. కలెక్టర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.
విజయవాడ కలెక్టరేట్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమ, వసంత కృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వరద బాధితులకు ఆహారం పంపించే అంశంపై సీఎం చంద్రబాబు వారితో చర్చించారు. అటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దైంది. చంద్రబాబు తాత్కాలిక సీఎం కార్యాలయంగా విజయవాడ కలక్టరేట్ మారింది.
దాదాపు 6 వేల మందికి యుద్ధ ప్రాతిపదికన ఆహారం ఏర్పాటు చేశారు ఎంపీ కేశినేని చిన్ని. ఆహార సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చూడాలని అధికారులకు హోంమంత్రి ఆదేశించారు. ఆహార ప్యాకింగ్, సరఫరాకు తెలుగుదేశం శ్రేణులు ముందుకొచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు విజయవాడ కలెక్టరేట్ కు వచ్చారు. ఆహారo ప్యాకింగ్, సరఫరాకు అక్షయ పాత్ర, ఇతర సంస్థలకు తెలుగుదేశం కార్యకర్తలను పురమాయించారు.
* విజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
* ఇవాళ రాత్రికి విజయవాడ కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు బస
* బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చేవరకు విశ్రమించేది లేదన్న చంద్రబాబు
* పాలు, నీళ్లు, ఆహారం, టార్చ్ లు తెప్పించాలని ఆదేశం
Also Read : నీట మునిగిన కాలనీలు, స్తంభించిన జనజీవనం.. విజయవాడలో వరద బీభత్సం