Cm Chandrababu: దేశానికి సరైనోడు.. ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు- ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం
2038 నాటికి ప్రపంచంలో భారత్ రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

Cm Chandrababu: దేశ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను ఎంతో మంది ప్రధానులను చూశాను కానీ మోదీలాంటి ఆలోచనాపరుడిని చూడలేదన్నారు. మనందరి భవిష్యత్ కాపాడే నాయకుడు మోదీ అని చంద్రబాబు కితాబిచ్చారు. ఈతరం నాయకుడు మోదీ అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి మోదీ అంటూ కీర్తించారు చంద్రబాబు.
కర్నూలు నన్నూరులో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు వల్ల అందరూ లాభం పొందారని అన్నారు. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. మోదీ నాయకత్వంలో 4వ స్థానానికి చేరిందన్నారు. 2038 నాటికి ప్రపంచంలో భారత్ రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సైన్యం పరంగా మన శక్తి ఏంటో ఆపరేషన్ సిందూర్ తో చూపించారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీకి డబుల్ బెనిఫిట్ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
”సెమీ కండక్టర్లు, క్వాంటమ్ వ్యాలీ రావడానికి మోదీ సాయం చేశారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు కానుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేశాం. ప్రధాని మోదీ చేస్తున్న సాయాన్ని మరువలేము. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లబ్ది పొందుతున్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. భవిష్యత్తులో మరిన్ని ఉంటాయి. అన్ని వర్గాలకు మేలు జరిగేలా మోదీ సంస్కరణలు తెచ్చారు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Also Read: దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి ఎంతో ముఖ్యం.. చంద్రబాబు విజన్ ప్రశంసనీయం- కర్నూలు సభలో ప్రధాని మోదీ