సీఎం జగన్ అభిప్రాయం మార్చుకోవాలి..అమరావతి రైతుల అల్టిమేటం

ఏపీలో రాజధాని రాజకీయం రంజుగా మారింది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా… ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకటించిన మూడు ప్రాంతాల్లో రాయలసీమ, వైజాగ్ ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా… ఇన్నాళ్లు అమరావతినే తమ రాజధానిగా ఊహించుకుని, దాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఆందోళన బాటపట్టారు.
2019, డిసెంబర్ 19వ తేదీ గురువారం అమరావతి బంద్‌కు పిలుపునిచ్చారు రాజధాని రైతులు. 29 గ్రామాల్లో బంద్ పాటించనున్నారు. అలాగే, 29 గ్రామాల్లోని గ్రామ సచివాలయ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రిలే దీక్షలు చేపట్టనున్నారు. నిరసన కార్యక్రమాల్లో రైతులు, రైతు కూలీలు, గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రోడ్ల దిగ్బంధనం, వంటావార్పు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.
బుధవారం అమరావతిలోని మందడం, వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెంలో రైతులు ఆందోళన చేపట్టారు. మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి.. రాస్తారోకో చేశారు. అలాగే ఉద్దండరాయుని పాలెంలో అమరావతికి ప్రధాని మోదీ శిలాఫలకం వేసిన చోట రైతులు బైఠాయించారు. పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. పరిపాలన అంతా అమరావతి నుంచే జరగాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు రైతులు.
సీఎం జగన్ తన అభిప్రాయం మార్చుకోకపోతే.. ఆమరణ దీక్షకైనా సిద్ధమని చెబుతున్నారు రాజధాని ప్రాంత రైతులు. ఏపీలో 3 రాజధానులు అవసరం లేదని.. తామిచ్చిన భూములను అభివృద్ధి చేసి ఇవ్వాల్సిందేనన్నారు రైతులు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో.. పోరాటం చేస్తామని ప్రకటించారు. రాజకీయాల కోసం తమ జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రైతుల ఆందోళనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.
Read More : రాజధాని గ్రామాల్లో డిసెంబర్19, గురువారం బంద్