మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే- సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు జగన్.

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే- సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

Updated On : May 30, 2024 / 8:00 PM IST

Cm Jagan : ఏపీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. గెలుపెవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో విజయంపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వైసీపీ, ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ట్విట్టర్ లో ఆసక్తికర పోస్టు చేశారు.

దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్న జగన్.. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతీ కుటుంబానికి మన ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు జగన్. ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మన ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకేస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్. దాంతోపాటుగా గతంలో ప్రమాణస్వీకారం చేసిన ఫొటోను పోస్ట్ చేశారు జగన్.

2019 మే 30వ తేదీ.. సరిగ్గా ఇదే రోజు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఇవాళ్టితో సరిగ్గా ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ లో ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని.. మరింత మంచి చేస్తామని జగన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఆరు నూరైనా ఫలితమిదే..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్.. లండన్ వెళ్లే ముందు ఐప్యాక్ టీమ్ సభ్యులతో మాట్లాడుతూ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, దేశం అంతా షాక్ అయ్యేలా ఏపీ ఫలితాలు ఉంటాయని జగన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. రేపు రాత్రి లండన్ నుంచి తిరిగి అమరావతికి జగన్ రానున్నారు. ఐదేళ్లు పూర్తైన సందర్భంగా జగన్ చేసిన ట్వీట్ మరోసారి రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.