YSR Jagananna Colonies : 30లక్షల మందికి ఇళ్లు.. జూన్ 2022 నాటికి తొలిదశ పూర్తి
సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి కల. ఆ కలను తాము నేరవేరస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ రాబోతున్నాయని చెప్పారు.

Ysr Jagananna Colonies
YSR Jagananna Colonies : సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి కల. ఆ కలను తాము నేరవేరస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ రాబోతున్నాయని చెప్పారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణం పథకం మొదటి దశను జగన్ ప్రారంభించారు.
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా 2023 జూన్ నాటికి ప్రభుత్వం రెండు దశల్లో 28,30,227 పక్కా గృహాలను రూ.50,994 కోట్లతో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు దశల్లో కలిపి 30 లక్షల మందికి లబ్ధి చేకూరబోతుందని ఆయన వివరించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పథకంలో భాగంగా దేశ చరిత్రలో తొలిసారిగా 15లక్షల 60వేల 27 ఇళ్ల నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు.
జూన్ 2022 నాటికి తొలిదశ పూర్తి:
తొలిదశలో రూ.28,084 కోట్లు, రెండో దశలో రూ.22,860 కోట్ల వ్యయంతో పక్కా గృహాలను నిర్మిస్తున్నామని జగన్ అన్నారు. తొలిదశను జూన్ 2022 నాటికి పూర్తి చేస్తామని.. రెండో దశను అప్పుడే ప్రారంభిస్తామన్నారు. 8వేల 900 లే అవుట్లలో 11 లక్షల 26 వేల ఇళ్ల నిర్మాణాలకు ఇవాళ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇళ్ల స్థలాలున్న 4.33 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు జగన్ స్పష్టం చేశారు.
కాలనీల్లో అధునాతన సౌకర్యాలు..
* జగనన్న కాలనీల్లో రూ.4,128 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీరు
* రూ.22,587 కోట్లతో కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణం
* ఈ కాలనీల్లో అధునాతన సౌకర్యాలు
* జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మాణం
* ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకు
* సొంతగా కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుంది.
* సొంత స్థలాలు ఉండి, ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు మరో 4.33 లక్షల మంది ఉన్నారు.
* ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు ఖర్చు.
* అర్హులు ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
* గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం.
ఇళ్ల నిర్మాణం వల్ల కూలీలకు పెద్ద సంఖ్యలో పని దినాలు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందని జగన్ తెలిపారు. 30 రకాల పనులకు సంబంధించిన వారికి ఉపాధి లభించినట్లు అవుతుందన్నారు. నిర్మాణాలకు సమీపంలోని ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుక అందేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.