అగ్రికల్చర్‌ మిషన్‌పై జగన్ సమీక్ష : రైతు నష్టపోకూడదు..పరిస్థితిలో మార్పు రావాలి

  • Published By: madhu ,Published On : February 6, 2020 / 11:53 AM IST
అగ్రికల్చర్‌ మిషన్‌పై జగన్ సమీక్ష : రైతు నష్టపోకూడదు..పరిస్థితిలో మార్పు రావాలి

Updated On : February 6, 2020 / 11:53 AM IST

రైతు భరోసా కేంద్రాల లోగో, భరోసా కేంద్రాల ద్వారా విత్తన కొనుగోలు చేసుకొనే వెబ్ సైట్‌లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ధరల పట్టిక ఉండాలని, ప్రకటించిన ధరల కన్నా తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం అగ్రికల్చర్ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 

ప్రభుత్వమే పంటలను కొనుగోలు :-
రైతుల నుంచి ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వివరాలు, మద్దతు ధర రేట్లను గ్రామ సచివాయాల్లో ప్రదర్శించాలన్నారు. వారానికొకసారి సమావేశమై రైతులకు అందుతున్న ధరలపై సమీక్షించాలని అధికారులకు సూచించారు. తర్వాత..నాలుగు వారాలకోసారి తనతో సమావేశం కావాలన్నారు సీఎం జగన్. ఎక్కడా రైతు నష్టపోకూడదని, ఎవరైనా రైతు నష్టపోతే..వెంటనే అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం సరైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మార్చి కల్లా పరిస్థితిలో మార్పు రావాలి :-
పంటను కొన్న తర్వాత..వెంటనే రైతులకు డబ్బులు అందచేసే విధంగా చర్యలుండాలన్నారు. మొత్తంగా వచ్చే మార్చికల్లా పరిస్థితిలో మార్పు రావాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులను చేయడం జరుగుతుందన్నారు. రైతుల విషయంలో అధికారులు సవాలుగా తీసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వచ్చినా పర్వాలేదన్నారు. అలాగే..శ్రీకాకుళం గోదాముల సమస్యపై దృష్టి పెట్టాలని, కొత్త గోదాముల నిర్మాణం జరిగేంత వరకు ప్రత్యామ్నాయం చూడాలన్నారు. సరిపడా గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.