కాయ్ రాజా కాయ్ : ఏపీలో జోరుగా కోడి పందేలు

Cock Fighting : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా పందెం రాయుళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు. వారం రోజులుగా పందెం బరులను పోలీసులు ధ్వంసం చేసినా కోళ్లు మాత్రం కత్తికట్టాయి. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. 2021, జనవరి 14వ తేదీ గురువారం ఉదయం నుంచే పందెం రాయుళ్లు బరులకు చేరుకొని వేలు, లక్షల్లో పందేలు కాస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో కోళ్ల పందాల బరులు భారీ ఎత్తున సిద్ధం చేశారు. అలాగే లంక గ్రామాలే కాకుండా నదీపాయల్లోని బరుల్లో కూడా కోడి పందేలు జరుగుతున్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, వీరవారసరం, నరసాపురం, గోపాలపురం, దేవరపల్లి, తణుకు మండలం తేతలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో కోడి పందాల బరులు భారీ ఎత్తున సిద్ధమయ్యాయి. గుంటూరు జిల్లాలోని తెనాలి, రెపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో కూడా కోడిపందాల కోసం బరులు ఏర్పాటు చేశారు.
కృష్ణాజిల్లా వ్యాప్తంగానూ కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విదించినా కోడిపందాలు ఆగడం లేదు. గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, పెనమలూరు, బాపులపాడు, కంచికచర్ల, నందిగామ, తోట్లవల్లూరు మండలాల్లో బరులు పందెం రాయుళ్లతో కిటకిటలాడుతున్నాయి. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఉదయం నుంచే పందేలు మొదలయ్యాయి.
ఏటా మాదిరిగానే ఈ కోడి పందేలపై కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. గతేడాది వరకు ప్రతి ఏటా పందేల నిర్వాహకులు ఒకే చోట బరులు ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఈసారి మాత్రం రూటు మార్చారు. ఎప్పుడు వేసే చోట కాకుండా ప్రధాన రహదారులకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో, కొబ్బరి తోటలు, మామిడి తోటలు, పామాయిల్ తోటల్లో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు.