Vizianagaram : విజయనగరంలో కరోనా మరణాలు..తల్లడిల్లుతున్న ప్రజానీకం

విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.

Vizianagaram : విజయనగరంలో కరోనా మరణాలు..తల్లడిల్లుతున్న ప్రజానీకం

Vizayanagaram

Updated On : May 16, 2021 / 8:39 PM IST

Corona Deaths : విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. ఎవరు, ఎప్పుడు చనిపోతున్నారో… ఆసుపత్రికి వెళ్లిన వారు బతికే ఉన్నారా.. అన్న అనుమానాలు, భయాందోళనలతో విజయనగరం జిల్లా ప్రజానీకం తల్లడిల్లిపోతోంది. ప్రతీ రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆసుపత్రి, హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకొని, కోలుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయినా మరణాలు మాత్రం ఆగడం లేదు.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోతున్నవారు కొందరైతే.. హోం ఐసోలేషన్ లో ఉన్నవారు, ఉన్నట్టుండి చనిపోతున్నవారు మరికొందరు. ఇలా ప్రతీ రోజూ ఊహించని స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 20 రోజుల్లో జిల్లాలో కరోనాతో చనిపోయిన వారు దాదాపు 200 కి పైగా ఉన్నారంటే విజయనగరం జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం అధికారిక సమాచారం మాత్రమే. కానీ అనధికారికంగా, ప్రభుత్వ రికార్డుల్లోకెక్కని మరణాలు రెట్టింపు సంఖ్యలో ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెకెండ్ వేవ్ కరోనా విజృంభణ తర్వాత గత నెల రోజుల్లో విజయనగరం జిల్లాలో సుమారు 20 వేల పాజిటిక్ కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. కానీ అనధికారికంగా భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. రికార్డుల్లోకెక్కని మరణాలు ప్రతీ రోజూ పదుల సంఖ్యలో ఉంటున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఎం.ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రుల్లోనే మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక కారణాలతో ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వస్తున్నారు. అది కూడా అత్యవసర పరిస్థితిల్లో ఆసుపత్రులకు వస్తుండటంతో ఆ సమయంలో ఆక్సిజన్ బెడ్స్ దొరక్కపోవడం, దొరికినా.. సకాలంలో ఆక్సిజన్ సరఫరా జరక్కపోవడంతో పాటు అప్పటికే వారి పరిస్థితి విషమిస్తుండటంతో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతీ రోజూ జిల్లాలో అధికారికంగానే సుమారు పదికి తక్కువ కాకుండా మరణాలు నమోదవుతుండటం అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. జిల్లా యంత్రాంగం కరోనాకు కట్టడికి అడ్డుకట్ట వేసి, తమ ప్రాణాలు కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Read More : Hester : కోవాగ్జిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్ తో హెస్టర్ చర్చలు