కరోనా వైరస్ : తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చెప్పబోతున్నారు ? కఠిన ఆంక్షలు!

కరోనా వైరస్ భారతదేశంలో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో నెగటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. దీంతో కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధానంగా ప్రజా రవాణాపై దృష్టి సారించింది. ఇతర ప్రాంతాల వైపు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తోంది. రైళ్ల సర్వీసులను రద్దు చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే…ఇక్కడ కూడా కేసులు క్రమ క్రమంగా అధికమౌతున్నాయి. ఇప్పటికే పలు నిబంధనలు, ఆంక్షలు అమల్లో పెట్టినా పలువురు వైరస్ బారిన పడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ కు సీఎంలు కేసీఆర్, జగన్ లు సంపూర్ణ సపోర్టు ప్రకటించారు. కానీ 14 గంటలు వద్దని…24 గంటలు పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అనుకున్నట్లుగానే..ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు.
దీంతో రాష్ట్రాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కానీ వైరస్ మరింత వ్యాపిస్తున్న తరుణంలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు (జగన్, కేసీఆర్) నడుం బిగించినట్లు..తెలుస్తోంది. అందులో భాగంగా 2020, మార్చి 22వ తేదీ..సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5 గంటల తర్వాత వీరి మీడియా సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.
తెలంగాణాలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కాసేపట్లో తెలియనుంది.