విశాఖను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు..!

Cyber War in Vizag : అది మొన్నటి వరకు ఉక్కు నగరం. ఇప్పుడు దాని పేరు మారే పరిస్థితి వచ్చింది. సైబర్ క్రైమ్స్‌కు అడ్డాగా మారుతోంది. కేటుగాళ్ల కళ్లు విశాఖ సిటీపై పడడంతో… ఫోర్జరీలు, ఆర్థిక మోసాల్లో దూసుకుపోతోంది. దీంతో స్టీల్ సిటీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. విశాఖ నగరాన్ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఉక్కు నగరంలో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో విశాఖ నగరం జాతీయ స్థాయిలో సైబర్ మోసాలకు ఖిల్లాగా మారుతోంది.
నేషనల్ రేంజ్‌లో నమోదవుతున్న మొత్తం సైబర్ క్రైమ్స్‌లో 14.4శాతం నేరాలు విశాఖలోనే జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం… దేశంలో సైబర్ నేరాల్లో విశాఖ నగరం ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. 16.1శాతం నేరాలతో వారణాసి తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానం విశాఖదే.
విశాఖలో ప్రతి లక్ష మందిలో ముగ్గురు.. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. నగరంలో ప్రతి లక్ష మందిలో 141 మంది మహిళలు బాధితులుగా మారుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ స్పష్టం చేస్తోంది. గతేడాది విశాఖలో ఏకంగా 40 సైబర్ నేరాలు నమోదవ్వడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
విశాఖ పోర్టు వెబ్‌సైట్ హ్యాక్ :
ఎక్కడో ఓ చోట నుంచి సైబర్ నేరగాళ్లు ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత మరింత రెచ్చిపోయారు. ఏకంగా విశాఖ పోర్టు వెబ్‌సైట్‌ను టార్గెట్ చేశారు. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేశారు. చాలా మంది నిరుద్యోగుల నుంచి ఫీజు పేరుతో లక్షల్లో వసూలు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్‌కు కంప్లైంట్ వెళ్లిన వారంలోనే మరో వెబ్‌సైట్ సృష్టించి డబ్బులు వసూలు చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఓ నేవి ఉద్యోగికి ఫేస్‌బుఖ్ ద్వారా అమ్మాయితో వల విసిరి కోటి 60 లక్షలు కొల్లగొట్టారు. మరొకరి దగ్గర విదేశీ నోట్ల మార్పిడి పేరుతో బురిడీ కొట్టించి లక్షలు దోచుకున్నారు.
విశాఖకు ఒకే సైబర్ క్రైమ్ పీఎస్ :
విశాఖలో ఒకే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. నేరాల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. మరోవైపు విశాఖ నగర పరిధి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ సరిపోతుందా అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.
ఒక్క కంప్లైంట్ వెళ్లిందంటే అది ట్రేస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. దీంతో సైబర్ క్రైమ్ కేసుల్లో పురోగతి ఉండటం లేదు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జాబ్స్ పేరిట, బ్యాంక్‌ల పేరిట.. చివరికి హనీట్రాప్‌తోనూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఎవర్నీ వదలకుండా అడ్డంగా దోచుకుంటూ.. ఉక్కుసిటీని సైబర్ క్రైమ్స్‌లో రెండో స్థానంలో నిలబెట్టారు.