Montha Cyclone : మొంథా తుపాను ఎఫెక్ట్.. మత్స్యకారుల కుటుంబాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం ..
Montha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య ..
Montha Cyclone
Montha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎంఏ) ప్రకటించింది. అయితే, ఈ తీవ్ర తుపాను ఇవాళ మధ్యాహ్నంకు తుపానుగా మారింది. సాయంత్రంకు వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మొంథా తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను, మత్స్యకారులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా ఇంచార్జి మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగిందని తెలిపారు.
శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు తుఫాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతీ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిచి, ప్రతి గ్రామానికి అధికారులను నియమించి.. ఏ విధమైన ప్రాణ నష్టం కలగకుండా చూశామని అన్నారు. మత్స్యకారుల ప్రతి కుటుంబానికి 50కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయ రంగాల్లో ఏవిధంగా నష్టం జరిగిందనే విషయాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. నష్టం వివరాలను కేంద్ర ప్రభుత్వనికి పంపించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.
తుపాను వల్ల నష్టపోయిన ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇది రైతు ప్రభుత్వం.. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి చెప్పారు. జిల్లాలో 300 కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి.. 25 ట్రాన్స్ ఫార్మర్లు ఫెయిల్ అయ్యాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనిచేసి రెండు మూడు గంటల్లో అన్ని సబ్ స్టేషన్ నుండి విద్యుత్ ను పునరుద్దరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. జిల్లాలో అన్ని రోడ్లుపై భారీ వృక్షాలు పడినప్పటికీ.. ట్రాపిక్ కు అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మొంథా తుఫాను కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, కంది, మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయని.. దెబ్బతిన్న పంటలను తిరిగి కోలుకునే దిశగా తీసుకోవాల్సిన సత్వర చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తూ పోస్టర్లను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు), కందిపప్పు కిలో, నూనె ఒక లీటర్, ఉల్లిపాయలు కిలో, బంగాళాదుంపలు కిలో, చక్కెర కిలో పంపిణీకి ఆదేశాలిచ్చారు. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా చర్యలు వెంటనే ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్‌ను ఆదేశించారు. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించారు.
