Araku coffee : అరకు కాఫీకి బలే గిరాకీ…

రంగు, రుచి, నాణ్యతలో మన్యం కాఫీ దేశీయంగా గుర్తింపు పొందింది. కాఫీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది.

Araku coffee : అరకు కాఫీకి బలే గిరాకీ…

Demand For Araku Coffee1

Updated On : March 28, 2021 / 11:12 AM IST

demand for Araku coffee : రంగు, రుచి, నాణ్యతలో మన్యం కాఫీ దేశీయంగా గుర్తింపు పొందింది. కాఫీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఒకప్పుడు ఏజెన్సీలో దళారులే కాఫీ గింజలు కొనుగోలు చేసేవారు. మారుతున్న పరిస్థితులతోపాటు జాతీయంగా కాఫీకి పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వంతోపాటు పేరొందిన ప్రైవేటు సంస్థలూ కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. సంస్థల మధ్య పోటీ పెరగడంతో కరోనా వంటి కష్టకాలంలోనూ ఆశాజనకమైన ధర పలుకుతుండడం కాఫీ రైతులకు ఊరటనిస్తోంది.

ఏజెన్సీ వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఏటా పది వేల టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. గత అయిదేళ్లగా పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రభుత్వరంగ సంస్థగా పేరొందిన జీసీసీతోపాటు నాంది, టాటా, ఇతర ప్రైవేటు సంస్థలు కాఫీ కొనుగోలు చేస్తున్నాయి. ఏటా ఆయా సంస్థలు మూడు నుంచి నాలుగు వేల టన్నుల వరకు రైతుల వద్ద సరకు తీసుకుంటున్నాయి.

జీసీసీ ఈ ఏడాది పార్చెమెంట్‌కు కేజీ ధర రూ. 143 నిర్ణయించగా.. టాటాతో పాటు ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు కేజీ రూ.170 నుంచి రూ. 190 వరకు చెల్లిస్తూ కాఫీ గింజలను సేకరిస్తున్నాయి. కాఫీ పండ్లు కేజీ రూ. 27 నుంచి రూ. 40 వరకు ధర పలుకుతున్నాయి. వెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటైన చింతపల్లి అగ్రికల్చర్‌, అలైడ్‌ ప్రొడక్ట్సు మాక్స్‌ లిమిటెడ్‌ నుంచి 10 వేల కేజీలు కొనేందుకు టాటా సంస్థ ముందుకొచ్చింది. అరబికా పార్చెమెంట్‌ రకం కాఫీ కేజీకి రూ. 193 ధర కేటాయించింది.

ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన చింతపల్లి గిరిజన ఆర్గానిక్‌ కాఫీ సొసైటీ 650 టన్నుల కాఫీ పండ్లను రైతుల నుంచి సేకరించింది. కేజీకి రూ. 27 చొప్పున చెల్లింపులు చేసింది. గిరిజన సహకార సంస్థ కేజీ పార్చెమెంట్‌ ధర రూ. 143, చెర్రీ ధర రూ. 63 గా ప్రకటించింది. ఏజెన్సీ వ్యాప్తంగా రెండు వేల టన్నుల వరకు కాఫీ గింజలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది. నాంది, మన్య తోరణం సంస్థలూ రైతుల నుంచి కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నాయి.

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కాఫీ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో కాఫీ సాగు విస్తరణ, రైతు సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. కాఫీ గింజలు శుద్ధి చేసి విక్రయించిన తర్వాత చెల్లింపులు చేస్తున్నారు. జీసీసీతో కలిసి రైతులకు ఆదాయం పెరిగేలా ఐటిడిఏ చేపడుతున్న చర్యలు మంచిఫలితాలు ఇస్తున్నాయి.