Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ కోసం పోలీసుల వేట.. అరెస్ట్ పై పోలీసు అధికారి కీలక వ్యాఖ్యలు..
ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించామన్నారు.

Ram Gopal Varma (Photo Credit : Google)
Ram Gopal Varma : డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎక్కడ ఉన్నారు అనేది మిస్టరీగా మారింది. మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసిన కేసులో వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఇదే వ్యవహారంలో ఒంగోలు పోలీసులు ఈ ఉదయం ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. అయితే, అతడు ఇంట్లో లేడని సిబ్బంది చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు తాను కోయంబత్తూరులో సినిమా షూటింగ్ లో ఉన్నానని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మోహన్ లాల్ తో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. పోలీసులు వర్మ ఇంటికి రావడంపై అతడి అడ్వకేట్ స్పందించారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు వర్మ సిద్ధంగా ఉన్నారని అడ్వకేట్ చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఈ ఉదయమే డీఎస్పీకి వాట్సాప్ లో పంపించామన్నారు. మరోవైపు ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నారు.
కాగా.. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకునేది లేదన్నారు విచారణ అధికారి శ్రీకాంత్ బాబు. వర్చువల్ గా విచారణకు హాజరవుతారని ఆర్జీవీ రిక్వెస్ట్ చేసినట్లుగా తెలిపారు. అయితే, ఒక విచారణ అధికారిగా తనకున్న టెన్ పవర్స్ దృష్ట్యా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదన్నారు. పోలీసు అధికారుల నోటీసులు ధిక్కరించారు కాబట్టి చట్ట ప్రకారం ఆర్జీవీని అరెస్ట్ చేస్తామంటున్నారు విచారణ అధికారి శ్రీకాంత్ బాబు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలను వర్మ గతంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పలు పోలీస్ స్టేషన్లలో వర్మపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు రేపు విచారించనుంది.
Also Read : చంద్రబాబును తిట్టిన వాళ్లను వదిలేది లేదు- కొడాలి నాని, వంశీల బుద్దా వెంకన్న ఫైర్