Penukonda YCP: పెనుకొండ వైసీపీలో మాజీమంత్రుల ఆధిపత్య పోరు

మాజీ మంత్రి శంకర నారాయణ పెనుకొండలోనే నివాసం ఉంటు తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే..సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ మాత్రం బెంగళూరులో ఉంటూ నెలకు ఒకసారి పెనుకొండ వచ్చి వెళ్తూ రాజకీయం చేస్తున్నారు.

Penukonda YCP: పెనుకొండ వైసీపీలో మాజీమంత్రుల ఆధిపత్య పోరు

Updated On : January 1, 2025 / 8:29 PM IST

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్యం కోసం గొడవ పడ్డారంటే ఓకే. ఎన్నికల సమయంలో సీటు కోసం రచ్చకెక్కారన్నా పర్లేదనుకోవచ్చు. కానీ పార్టీ దారుణ ఓటమి తర్వాత కూడా పెనుకొండ వైసీపీలో ఆధిపత్య పోరు ఒక రేంజ్‌లో కొనసాగుతోంది. ఇద్దరు మాజీమంత్రులు..తనకు ఆ నియోజకవర్గమే కావాలంటూ పంతం పట్టి కూర్చున్నారు.

ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయిన క్యాడర్, లీడర్లు..నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వైసీపీ ఓడిపోయిన రోజు నుంచే పెనుకొండ వైసీపీలో రచ్చ కంటిన్యూ అవుతోంది. ఇది నా నియోజకవర్గం అంటే..నా నియోజకవర్గమని..ఇద్దరు మాజీమంత్రులు గొడవ పెట్టుకుంటున్నారు. ఈ రచ్చను శాంతింప జేసేందుకు వైసీపీ అధినేత ఎంత ట్రై చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.

ఇందుకే వ్యతిరేకత?
అసలు పెనుకొండ వైసీపీలో ఈ రచ్చకు రీజన్ అధిష్టానం నిర్ణయమేంటున్నారు వైసీపీ లీడర్లు. 2019 ఎన్నికల ముందు వరకు బెంగళూరులో ఉన్న ఉషాశ్రీ చరణ్.. వైసీపీతో ఉన్న సంబంధాలతో కళ్యాణదుర్గం నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి.. మంత్రి కూడా అయ్యారు. అయితే ఆమెపై చాలా తక్కువ టైమ్‌లోనే కళ్యాణదుర్గం వైసీపీలో వ్యతిరేకత వచ్చింది. క్యాడర్, లీడర్లంతా ఆమెకు కళ్యాణదుర్గం టికెట్ ఇస్తే సహకరించేది లేదని హెచ్చరించారు. దీంతో అధిష్టానం ఆమెను పెనుకొండ నియోజకవర్గానిక ట్రాన్స్‌ఫర్ చేసింది.

అప్పటికే పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకర నారాయణ పరిస్థితి కూడా అప్పుడు అంత మంచిగా ఏమీ లేదు. మొదటి నుంచి సౌమ్యుడిగా ఉన్న శంకరర్ నారాయణ జగన్ తొలి క్యాబినెట్‌లోనే మంత్రిగా చేశారు. ఆయన సోదరుల వైఖరితో శంకర నారాయణపై కూడా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే ఆయన్ను అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. ఇష్టం లేకపోయినా అధినేత మాట కాదనలేక పార్లమెంట్ నుంచి పోటీ చేశారు శంకర్ నారాయణ.

ఇటు ఉషాశ్రీ పెనుకొండ నుంచి పోటీ చేశారు. అటు శంకర్ నారాయణ, ఇటు ఉషశ్రీచరణ్‌ ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత శంకర నారాయణ తన సొంత నియోజకవర్గం పెనుకొండకు రాగా..ఉషాశ్రీ కూడా పెనుకొండలోనే ఉంటానని పట్టుబట్టారు. దీంతో ఎన్నికలు ముగిసిన రోజు నుంచే మాజీ మంత్రుల మధ్య వార్ మొదలైంది. ఇది రోజురోజుకి పెరుగుతూపోయి..చివరకు ఉషాశ్రీ శంకర నారాయణ వర్గాన్ని టార్గెట్ చేసేంత వరకు వచ్చింది. మరోవైపు ఉషాశ్రీకి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా పగ్గాలు కూడా ఇచ్చారు. దీంతో ఉషాశ్రీకి మరింత పవర్ ఇచ్చినట్టైంది. అయితే ఇద్దరి మధ్య విబేధాలు పీక్‌ లెవల్‌కు చేరుకోవడంతో అధినేత జగన్ జోక్యం చేసుకుని ఇద్దరకీ సర్దిచెప్పారు. ఇక అప్పటి నుంచి ఉషాశ్రీ చరణ్ పెనుకొండలో దూకుడు పెంచారు.

ముగ్గరు నేతలపై వేటు
కళ్యాణదుర్గం తరహాలోనే పెనుకొండలో కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కువై పోయాయి. ఉషాశ్రీ చరణ్‌ను శంకర నారాయణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇన్ని రోజులు పట్టు కోసం ప్రయత్నించిన ఉషాశ్రీ చరణ్..ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై అటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గంలో అత్యంత కీలకంగా ఉన్న గోరంట్ల మండలంలో ముగ్గరు నేతలపై వేటు వేశారు. ఇది పార్టీలో మరింత వైరాన్ని పెంచింది. రెండు వర్గాలు వేర్వేరుగా సమావేశాలు పెట్టుకుని..ఒకరిపై ఒకరు నేరుగానే విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు.

పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పని చేస్తే మమ్మల్నే సస్పెండ్ చేస్తారా..అసలు ఉషాశ్రీ పెనుకొండలో ఎలా ఉంటారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. అటు ఉషాశ్రీ వర్గం కూడా శంకర నారాయణకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రైతు సమస్యలపై పార్టీ పిలుపునిచ్చిన పోరుబాట కార్యక్రమంలో కూడా విబేధాలు స్పష్టంగా కనిపించాయి. ఉషశ్రీ నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి శంకర నారాయణతో పాటు ఆయన వర్గం మొత్తం గైర్హాజరైంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై చేపట్టిన నిరసనలు కూడా ఎవరికి వారే అన్నట్టుగా సాగారు.

మాజీ మంత్రి శంకర నారాయణ పెనుకొండలోనే నివాసం ఉంటు తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే..సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ మాత్రం బెంగళూరులో ఉంటూ నెలకు ఒకసారి పెనుకొండ వచ్చి వెళ్తూ రాజకీయం చేస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా రెండు వర్గాలు రెండు కార్యక్రమాలు చేస్తూపోతున్నారు.

వైసీపీ అధినేత జగన్ పులివెందుల నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్తుంటే..ఉషాశ్రీ చరణ్ పెనుకొండ దగ్గర..శంకర నారాయణ కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర స్వాగతం పలికారు. ఇద్దరు మాజీ మంత్రులు తలోదారిలో వెళ్తుంటే..ఎవరికి మద్దతు తెలిపితే ఏం ప్రాబ్లమ్ వస్తుందోనని లోకల్ వైసీపీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. అధిష్టానం కలుగజేసుకొని మాజీమంత్రుల వైరంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో కూడా ఇలా విబేధాలు ఉండటం సరైంది కాదని మరికొందరు అంటున్నారు.

Perni Nani: రేషన్ బియ్యం ఉచ్చు పేర్నినానికే పరిమితం కాలేదా?