రాంగోపాల్ వర్మ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్లను అరెస్ట్ చేయాలంటే.. 80 నుంచి 90 శాతం మంది జైల్లో ఉంటారని అన్నారు.

Ram Gopal Varma Case : దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టుపైన అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై రాష్ట్రవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయని, ఇకపై ఈ పోస్టులపైన కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు ఆర్జీవీ. అయితే, ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ పిటిషన్ ను వాయిదా వేయాలని కోరడంతో ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసుల వేట కొనసాగుతోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలిస్తున్నారు.
ఆర్జీవీపైన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా పోలీసులు పలు మార్లు వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే, విచారణకు హాజరుకాకుండా వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, సోషల్ మీడియా పోస్టుల కేసులో ఒకవైపు పోలీసులు వర్మ కోసం వెతుకుతూ ఉండగా, మరోవైపు అజ్ఞాతంలో ఉంటూనే వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు వర్మ. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇస్తున్నారు. తాను కేసులకు భయపడటం లేదన్నారు. ఏడుస్తున్నానని, భయపడుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
ఏడాది క్రితం చేసిన ట్వీట్ పైన కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ వర్మ ఇప్పటికే ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో విడుదల చేసిన వర్మ.. సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్లను అరెస్ట్ చేయాలంటే.. 80 నుంచి 90 శాతం మంది జైల్లో ఉంటారని అన్నారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లమ్ అని, తన సమస్య కాదని వర్మ వ్యాఖ్యానించారు.
Also Read : కస్టోడియల్ టార్చర్ కేసు.. అప్పటి సీఐడీ చీఫ్‌కు చిక్కులు తప్పవా? ఆ పెద్ద నేతే టార్గెట్టా?